Guntur: పెమ్మసాని చొరవతో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌కు మహర్దశ!

Guntur: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో గుంటూరులోని డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ రెండో అంతస్తు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 13 Nov 2026 6:53 PM IST
Guntur
X

Guntur: పెమ్మసాని చొరవతో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌కు మహర్దశ!

గుంటూరు: గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో గుంటూరులోని డా. బి. ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ ఆధునిక సదుపాయాలతో త్వరలోనే అందుబాటులోకి రానుంది. పెమ్మసాని రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలకు స్పందిస్తూ.. అదనపు వసతుల కల్పనకుగానూ ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది.

ఈ బి.ఆర్. అంబేద్కర్ భవన్-కమ్-స్టడీ సర్కిల్ అభివృద్ధి ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనుకునే పేద విద్యార్థుల కలలకు మరో అడుగు ముందుకు పడినట్టయింది.

గుంటూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్-కమ్-స్టడీ సర్కిల్‌కు రెండో అంతస్తు (G+2) నిర్మాణం చేపట్టి, విశాలమైన లైబ్రరీ హాల్‌తో పాటు ఆధునిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ శాఖ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి రూ.4 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే టీడీపీ ప్రభుత్వం ఈ స్టడీ సర్కిల్ అభివృద్ధి నిమిత్తం రూ 6.4 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా ఎన్నికల అనంతరం ఈ ప్రాజెక్టును వైసిపి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. వైసిపి హయాంలో పట్టించుకోని కారణంగా ఈ స్టడీ సర్కిల్ అభివృద్ధి మూఢనపడి, పేద విద్యార్థులకు నిరుపయోగంగా మారింది. తిరిగి పెమ్మసాని చొరవతో ఈ స్టడీ సర్కిల్ కు రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది.

ఈ నిర్మాణంలో కల్పించనున్న ప్రధాన సదుపాయాలు:

విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు విశాలమైన లైబ్రరీ హాల్ నిర్మాణం. నిరంతర వినియోగానికి అవసరమైన విద్యుత్ సదుపాయాలు. స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య వసతులు. లైబ్రరీ వినియోగానికి అవసరమైన ఆధునిక ఫర్నిచర్ ఏర్పాటు. పది మంది ప్రయాణించే సామర్థ్యంతో లిఫ్ట్ సదుపాయం. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందులు లేకుండా 50 KVA సామర్థ్యం కలిగిన డీజిల్ జనరేటర్ ఏర్పాటు.

ఈ సందర్భంగా పెమ్మసాని స్పందిస్తూ.. ఈ సదుపాయాల కల్పనతో ముఖ్యంగా పేద విద్యార్థులకు మెరుగైన అధ్యయన వాతావరణం అందుబాటులోకి రానుందన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వసతులు, అవకాశాలు లేక వెనుకబడుతున్న విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల సాధన దిశగా విద్యార్థులకు ఇది ఒక మంచి వేదికగా మారనుందని ఆయన పేర్కొన్నారు.

విద్య ద్వారానే సామాజిక అభ్యున్నతి సాధ్యమనే ఆశయంతో, అర్హులైన ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో చేస్తున్న కృషిలో ఈ స్టడీ సర్కిల్ అభివృద్ధి మరో కీలక ముందడుగుగా నిలవనుందని వివరించారు.

కాగా తమ ప్రతిపాదనలకు స్పందించి, నిధులను మంజూరు చేయించడంలో సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి అలాగే కలెక్టర్ సాయి కాంత్ వర్మ కి, జిల్లా అధికారులకు పెమ్మసాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN