Guntur: ఈ నెల 30, 31న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్ పోలింగ్!
Guntur: గుంటూరులో ఈ నెల 30, 31న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. నవంబరు 5న పోలింగ్, 7న కౌంటింగ్ ఉంటుంది.
Guntur: ఈ నెల 30, 31న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్ పోలింగ్!
Guntur: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది తమ ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. హెల్ప్ డెస్క్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. పత్రాల ధ్రువీకరణ (అటెస్టేషన్) కోసం గెజిటెడ్ అధికారులను కేంద్రంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు.
ప్రతీ మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రూట్ ల వారిగా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది రాత్రికి బస చేయడం జరుగుతుందని, అచ్చట దోమల నియంత్రణకు మస్క్విటో కోయిల్ వంటి వస్తువులు సరఫరా చేయాలని ఆదేశించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల పంపిణీ కేంద్రంగా ఆంధ్రా ముస్లిం కళాశాల ఉంటుందని, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
తెనాలి పురపాలక సంఘంకు సంబంధించిన పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంను తెనాలిలో గల వి.ఎస్.ఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ముందుగానే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీలకు ఈ నెల 31న ఎన్నికల పంపిణీ జరుగుతుందని, నవంబరు 1వ తేదీన పోలింగ్ జరుగుతుందని చెప్పారు. నవంబరు 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.
జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నవంబరు 5వ తేదీన, కౌంటింగ్ 7వ తేదీన జరుగుతుందని చెప్పారు. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫొటో ఓటరు స్లిప్ లు నవంబరు 2వ తేదీ నాటికి పూర్తి చేసి, 3వ తేదీ నాటికి మార్కుడు కాపీ సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది రెండవ శిక్షణ కార్యక్రమం, రెండవ రాండమైజేషన్ శుక్రవారం జరుగుతుందని చెప్పారు.
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో 596 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. 207 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫోటో ఓటరు స్లిప్ పంపిణీ 75 శాతం పూర్తి అయిందన్నారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లకు 1,091 ఓట్లు ఇవ్వడం జరిగిందన్నారు. సర్వీస్ ఓటర్ల నుండి ఇంకా అందాల్సి ఉందని చెప్పారు.
తెనాలి పురపాలక సంఘం కమిషనర్ జె రామ అప్పల నాయుడు మాట్లాడుతూ 295 పోస్టల్ బ్యాలెట్ లు, 36 సర్వీస్ ఓటర్లను అందించడం జరిగిందన్నారు. ఫోటో ఓటరు స్లిప్ పంపిణీ 83 శాతం పూర్తి అయిందన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.




