Guntur: గాంధీ, శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకం కలెక్టర్ సాయికాంత్ వర్మ
Guntur: గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాలు అందరికీ స్ఫూర్తిదాయకమని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు.
Guntur: గాంధీ, శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకం కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాలు స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శుక్రవారం జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు మహనీయులన్నారు. మహానాయకుల జీవితాల నుంచి అనేక విషయాలు నేర్చుకొని, వారు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.
గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం అనేవి ప్రధానంగా నేర్చుకోవలసిన అంశాలని తెలిపారు. గాంధీజీ ఎంతో ఓర్పుతో, పట్టుదలతో లక్ష్యాన్ని వీడకుండా అనేక సంవత్సరాల పాటు స్వాతంత్ర్య పోరాటం సాగించారని గుర్తుచేశారు. ఎన్ని ఇబ్బందులు, జైలు శిక్షలు ఎదురైనా దేశ స్వాతంత్ర్యం కోసం నిలబడటం ఎంతో ఆదర్శనీయమన్నారు. ఈ తరం ప్రజలు, యువత వారిని ఆదర్శంగా తీసుకొని సరైన మార్గంలో నిలకడగా, ఓర్పుగా ముందుకు సాగాలని సూచించారు. అహింస, సత్యం అనే మార్గాలను ఆచరించారని చెప్పారు.
అన్యాయానికి ఎదురు నిలబడటానికి హింస మాత్రమే మార్గం కాదని నమ్మిన వ్యక్తి అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేశారని తెలిపారు. గాంధీజీ అంటరానితనాన్ని వ్యతిరేకించారన్నారు. ప్రతి మనిషికి సమాన గౌరవం ఉండాలని చెప్పారని పేర్కొన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి నిరాడంబరత, నిజాయితీ వంటి గుణాలను అలవర్చుకోవాలని చెప్పారు. ఉన్నతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన సాధారణ జీవితాన్ని గడిపారని, నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా నిలబడ్డారని ప్రశంసించారు. వారి గొప్పతనాన్ని, భావాలను తర్వాతి తరాలకు అందించడమే కాకుండా, వారు చూపిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, తదితరులు పాల్గొన్నారు.




