Guntur: అర్నాబ్ తుఫాన్ అలర్ట్ – విద్యాసంస్థలకు బుధవారం సెలవు!

Guntur: గుంటూరులో అర్నాబ్ తుఫాన్ తీవ్ర హెచ్చరిక. విద్యాసంస్థలకు బుధవారం సెలవు, అంగన్వాడీలకు 3 రోజులు హాలిడే. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08632234014 ఏర్పాటు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Oct 2026 9:31 PM IST
Guntur
X

Guntur: అర్నాబ్ తుఫాన్ అలర్ట్ – విద్యాసంస్థలకు బుధవారం సెలవు!

గుంటూరు: అర్నాబ్ తుఫాన్ కారణంగా బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని , తీవ్ర గాలులు ఉంటాయని ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ కోరారు. అత్యవసర పనులు ఉంటే మినహా బయటకు రావద్దని సూచించారు. అర్నాబ్ తుఫాన్ పై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు బుధవారం, 28వ తేదీన సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే మూడు రోజులు పాటు సెలవును ప్రకటించడం జరిగిందని చెప్పారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, దీనిపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, అవసరమైతే ఇప్పటికే సిద్ధం చేసిన 34 పునరావాస కేంద్రాలకు వెంటనే తరలించడం జరుగుతుందని చెప్పారు. వృద్ధులు చిన్నారులు గర్భిణీలు బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించినట్లు చెప్పారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వలు, వివిధ వాగుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జల వనరుల శాఖ పర్యవేక్షణ చేస్తుందని, ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో వాటిని గుర్తించాలని, అటువంటి చోట్ల ఇసుక బస్తాలు సిద్ధం వేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

గాలులకు హోర్టింగులు, ఫ్లెక్సీలు పడిపోయే అవకాశం ఉన్నందున వాటిని తొలగించడం జరుగుతుందని అన్నారు. తాగునీటి పథకాలు పూర్తి స్థాయిలో నింపుకోవడంతోపాటు, వాటి వద్ద జనరేటర్లు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. త్రాగునీరు ఎటువంటి పరిస్థితుల్లో కలుషితం కాకుండా క్లోరినేషన్ జరగాలని ఆదేశించామని అన్నారు. రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలను, విపత్తు నిర్వహణ శాఖ, విద్యుత్, రవాణా, పౌర సరఫరాల శాఖ తదితర శాఖలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

టెలికాం, మొబైల్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత టెలికం కంపెనీలు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు సిద్ధం చేసినట్లు చెప్పారు. అర్నాబ్ తుఫాన్ పట్ల రైతులను అప్రమత్తం చేయాలని అవసరమైన సూచనలు సలహాలను అందించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖలను ఆదేశించామన్నారు. పశువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వాటికి తగిన ఆహారము అందే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. రేయింబవళ్ళు పర్యవేక్షణకు సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల పనులను నిర్వహిస్తూనే మరో ప్రక్క తుఫాను పర్యవేక్షణ పనులు సమర్థవంతంగా నిర్వహించుటకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఆసుపత్రుల వద్ద విద్యుత్ ఆటంకం లేకుండా చూడాలి

ఆసుపత్రుల వద్ద ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిపారు. హై రిస్క్ లో ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలకు ఎటువంటి అంతరాయము ఉండరాదని స్పష్టం చేశారు.

వాగులు, వంకలు, నదులు దాటవద్దు

వాగులు, వంకలు, నదులు ఎవరు దాటువద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను తీవ్రత ఉండటం, నీటి ప్రవాహాలు పెరగటం జరుగుతుందని చెప్పారు. జల ప్రవాహాలు దగ్గర ఈతకు వెళ్లడం, చేపలు పట్టుటకు వెళ్లడం చేయరాదని కోరారు.

ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN