Guntur: కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్
Guntur: మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్. మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర ప్రాంతాలకు వరద ముప్పు అప్రమత్తత.
Guntur: కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్
గుంటూరు: "మురసు" తుఫాన్ ప్రభావంతో పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, ఆ నీటిని కిందకు వదలడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సియం.సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుండి వరద వచ్చే అవకాశం ఉన్నందున మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో గల కృష్ణా తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లంక గ్రామల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమ జిల్లా మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. మండల స్థాయి కార్యాలయం వరకు కంట్రోల్ రూమ్ లు 24 గంటలు పనిచేయాలని చెప్పారు. మండలాల్లో అన్ని కోణాల్లో సమీక్షించుకోవాలని, ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శిధిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, అందులో ఎవరు నివసించరాదని విజ్ఞప్తి చేశారు. చెరువులు, వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని, దాటుటకు ప్రయత్నించవద్దని కోరారు. తడిగా ఉన్న కరెంటు స్తంభాలను ముట్ట వద్దని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 20 నుండి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని చెప్పారు.
లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ప్రతీ గంటకు నివేదిక సమర్పించాలన్నారు. ప్రతీ వాగు, కాలువల పర్యవేక్షణకు ఒక్కొక్కరిని నియమించాలన్నారు. పరిస్థితిని అనుసరించి తక్షణం ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వలు, వివిధ వాగుల ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో వాటిని గుర్తించాలని, అటువంటి చోట్ల ఇసుక బస్తాలు సిద్ధం వేయాలని ఆదేశించారు.
గాలులకు హోర్టింగులు, చెట్లు కూలిపోయే పరిస్థితి ఉంటుందని, అర్నాబ్ తుఫాన్ లో తొలగించామని, మరోసారి తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్త రాదని అన్నారు. తాగునీటి పథకాలు వద్ద జనరేటర్లు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. త్రాగునీరు ఎటువంటి పరిస్థితుల్లో కలుషితం కాకుండా స్పష్టమైన పర్యవేక్షణ జరగాలని అన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వలన రవాణాకు ఆటంకం జరక్కుండా ట్రీ కట్టర్స్, పవర్ సాస్ లను సిద్ధంగా పెట్టాలని రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.
విపత్తు నిర్వహణ శాఖ అన్ని పరికరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. విద్యుత్తు స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చేసి విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని బంకుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. టెలికాం, మొబైల్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత టెలికం కంపెనీలు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద ఆహార తయారీ కోసం ఏజెన్సీలను సిద్ధం చేసి తక్షణ ఆహార పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ పట్ల రైతులను అప్రమత్తం చేయాలని అవసరమైన సూచనలు సలహాలను అందించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖలను ఆదేశించారు. పశువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వాటికి తగిన ఆహారము అందే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడ మనుషుల ప్రాణాలు గానీ, పశువుల ప్రాణాలు గానీ, ఆస్తుల నష్టంగాని జరగరాదని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల వద్ద విద్యుత్ ఆటంకం లేకుండా చూడాలి
ఆసుపత్రుల వద్ద ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. హై రిస్క్ లో ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలకు ఎటువంటి అంతరాయము ఉండరాదని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.




