Guntur: ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను విడుదల చేసిన కలెక్టర్
Guntur: గుంటూరులో ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. పీఎం సూర్య ఘర్ ద్వారా రూ.78 వేల వరకు సోలార్ సబ్సిడీ.
Guntur: ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను విడుదల చేసిన కలెక్టర్
గుంటూరు: “సేవా సేతు అభియాన్” పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా “సేవా సేతు అభియాన్” క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. “ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.
ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు.
రూ.78 వేల వరకు సబ్సిడీ
పథకం కింద అర్హత కలిగిన గృహ వినియోగదారులకు:
1 కిలోవాట్‌కు రూ.30,000
2 కిలోవాట్లకు రూ.60,000
3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000
వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.
“సేవా సేతు అభియాన్” క్యాంపుల ద్వారా ప్రజలకు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ పొందే ప్రక్రియ, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ క్యాంపుల్లో బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారని చెప్పారు.
ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమే లక్ష్యం అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తన ఇంటినే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో సేవా సేతు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ లు సి.హెచ్.రమేష్, సుధాకర్, కార్యనిర్వహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.




