Guntur: ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి: గుంటూరు కలెక్టర్

Guntur: ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచి సిజేరియన్లు తగ్గించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. సాయికాంత్ వర్మ అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Sept 2026 5:30 PM IST
Guntur
X

Guntur: ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి: గుంటూరు కలెక్టర్

గుంటూరు: వివిధ శాఖల ప్రగతిపై సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రగతి పథంలో ఉండుటకు ప్రతి శాఖ కృషి చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పడాలని స్పష్టం చేశారు. అసంక్రమిత వ్యాధుల సర్వే ప్రతీ గ్రామంలో పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశించారు.

ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని ఆదేశించారు. సిజేరియన్ ప్రసవాలు తగ్గాలని అన్నారు. మాతాశిశు మరణాల నివారణ ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో త్రీ స్టార్ రేటింగ్ పెరగాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలలు కనీసం రెండు, మూడు స్టార్ లలో ఉండాలని అన్నారు. వసతి గృహాల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం క్రింద యువతను నమోదు చేయాలని పేర్కొన్నారు. వారం రోజుల్లో నమోదు శాతం పెరగాలని స్పష్టం చేశారు. డి.డి.యు - జి.కె.వై నమోదులో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం ద్వారా మంచి గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలిపారు. కనీసం 20 వేల మందిని నమోదు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీలో పోషణ ట్రాకర్ మెరుగు పరచాలని చెప్పారు. ఇ - పంట నమోదు మూడు రోజుల్లో మెరుగుపడాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలో కాలువల నుండి తొలగిస్తున్న వ్యర్థాలు తక్షణమే తరలించే ఏర్పాటు చేయాలని సూచించారు.

తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుధ్యంలో పూర్తి స్థాయిలో పనిచేయాలని అన్నారు. స్వచ్ఛత హి సేవలో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు బహుమతులు పొందే స్థాయిలో ఉండాలని సూచించారు. అన్నా క్యాంటీన్ ల నిర్వహణపై దృష్టి సారించాలని, సమయానికి తెరుచుకోవడంతో పాటు సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలను పర్యవేక్షించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాగు నీటి సరఫరాలో లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. పల్లె పండగ 3.0 లో పశు శాలలు నిర్మాణానికి లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని చెప్పారు. వాటికి తక్షణం మంజూరు చేసి, లక్ష్యాలు

సాధించాలని స్పష్టం చేశారు. జలధార - జలహారతి కార్యక్రమం రెండవ దశలో జిల్లాలో 287 పనులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 236 పనులు ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు రెండు రోజులలో ప్రారంభం కావాలని అన్నారు. సి.సి రహదారులు, గ్రావెల్ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. అక్షర ఆంధ్ర - ఉల్లాస్ కార్యక్రమంలో అందరూ హాజరు అయ్యేటట్లు చూడాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్.ఐ.ఆర్ లో పెండింగ్ లో ఉన్న 19 నోటీస్ లపై తక్షణం విచారణ చేసి మంగళవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాకు సంబంధించి ఫోటోలు సరిపోయినదీ లేనిది, వాటి నాణ్యత ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఇంకా 682 పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇ.ఆర్.ఓ లు దృష్టి సారించాలని ఆదేశించారు.

ఎన్నికల పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికల పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశకాలు, నిబంధనలుపై స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు.

ఎం.ఎల్.సి ఓటరు నమోదుకు నోటీస్ జారీ

జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి మాట్లాడుతూ పూర్వ కృష్ణ - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరు నమోదుకు నోటీస్ జారీ చేయడం జరిగిందని చెప్పారు.

అన్ని ఎ.ఇ.ఆర్.ఓ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు కావడానికి ఉన్నత పాఠశాల లేదా అంత కంటే పై స్థాయిలో 3 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పని చేసిన అనుభవం ఉండాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు ఆంజనేయులు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా ఎస్.జి.ఎస్.డబ్ల్యు అధికారి ఆర్.రామలింగేశ్వర రెడ్డి, ఎస్.జి.ఎస్.డబ్ల్యు సమన్వయ అధికారి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధి అధికారి ఎం.క్రిస్టీ అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN