Guntur: బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి: కమిషన్ ఛైర్మన్ రాజు
Guntur: బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై గుంటూరు కలెక్టరేట్‌లో రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ ఎ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సమీక్షించారు.
Guntur: బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి: కమిషన్ ఛైర్మన్ రాజు
గుంటూరు: పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు, రక్షణ కల్పించడం ప్రతి శాఖ బాధ్యత అని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఛైర్‌పర్సన్ ఎ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు కె.జి.వి. పద్మలత, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, జిల్లా పర్యటనలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను పరిశీలించామని తెలిపారు. ప్రతి చిన్నారి హక్కులను పరిరక్షించడం, వారికి ఆరోగ్యం, విద్య, భద్రత, పోషణ వంటి సదుపాయాలు అందేలా చూడటం అందరి బాధ్యత అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల సంక్షేమం కోసం కేటాయిస్తున్న ప్రజాధనం సక్రమంగా వినియోగమై, దాని ప్రయోజనాలు పూర్తిగా పిల్లలకు చేరేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపేతం చేయాలి
గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను మరింత చురుకుగా పనిచేసేలా చూడాలని ఛైర్‌పర్సన్ సూచించారు. సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, గ్రామ పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులతో కూడిన కమిటీలు తమ పరిధిలోని పిల్లల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ నెలకు కనీసం ఒక్కసారి సమావేశం కావాలని, ప్రతి నెల పాఠశాలలను తనిఖీ చేసి డ్రాప్‌అవుట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయి కమిటీలు గ్రామ, వార్డు స్థాయి కమిటీల పనితీరును పర్యవేక్షించాలన్నారు.
బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు
14 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండేలా చూడాలని, ఎలాంటి పనుల్లోనూ బాలలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయకుండా నిరోధించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న బాల్యవివాహాలను గుర్తించి అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోక్సో కేసులు, టీనేజ్ గర్భధారణలపై అప్రమత్తత
సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలపై ప్రతికూల ప్రభావం పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. పోక్సో కేసులు, టీనేజ్ గర్భధారణలను అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
అంగన్‌వాడీల్లో పోషకాహారం, పాఠశాలల్లో మౌలిక వసతులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, కనీసం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి సురక్షితమైన తాగునీరు అందించాలని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం గణితం, సైన్స్‌పై మాత్రమే కాకుండా భాషా సబ్జెక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
హాస్టళ్లలో భద్రతకు ప్రాధాన్యత
సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన సందర్భాల్లో రాత్రి వేళల్లో హాస్టళ్లలో బస చేసి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో విద్యార్థుల సమస్యలు, సూచనలు తెలియజేసేందుకు తప్పనిసరిగా సలహాలు/ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చిన్నారులను మాదకద్రవ్యాల సరఫరాకు వినియోగించకుండా చర్యలు
గంజాయి వంటి మాదకద్రవ్యాల సరఫరాకు కొంతమంది చిన్నారులను ఉపయోగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని చైర్మన్ తెలిపారు. తమకు తెలియకుండానే చిన్నారులు నేరస్థులుగా మారే పరిస్థితులను అరికట్టేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో నేటి పిల్లలే భవిష్యత్ భారత పౌరులని పేర్కొంటూ, వారిని ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా, నైతిక విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ ఐసీడీఎస్ శాఖ పనితీరు గత ఆరు నెలల్లో గణనీయంగా మెరుగుపడిందని, అయితే ఇంకా కొన్ని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యంగా గుడ్ల నాణ్యత విషయంలో రాజీ పడరాదన్నారు. అలాగే మాదకద్రవ్యాల నియంత్రణలో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పోలీస్, ఇతర శాఖలకు సూచించారు. సంక్షేమ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు, కనీసం నెలకు ఒకసారి రాత్రి వేళ హాస్టళ్లలో బస చేసి విద్యార్థులతో మాట్లాడాలని సూచించారు.
ఇలా చేయడం ద్వారా విద్యార్థులు స్వేచ్ఛగా తమ సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందని, హాస్టళ్లలోని వాస్తవ పరిస్థితులను అధికారులు తెలుసుకోగలుగుతారని తెలిపారు. బాలల సంక్షేమానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, కమిషన్ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. విజయలక్ష్మి, ఐసిడిఎస్ పీడీ ప్రసూన, డీసీసీపీ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




