Guntur: బీసీ రిజర్వేషన్ల జీవోల రద్దుపై వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియా సమావేశం
Guntur: బీసీ రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు రద్దు చేయడంపై జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
Guntur: బీసీ రిజర్వేషన్ల జీవోల రద్దుపై వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియా సమావేశం
గుంటూరు: సుప్రీంకోర్టు ధర్మాసనం 2010 లోనే స్థానిక సంస్థలకు రిజర్వేషన్ 50 శాతం మించరాదని స్పష్టంగా తెలియజేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల ప్రజలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 105 జీవో, 1065 జీవోలను విడుదల చేసిందని ఈనెల 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ జీవోలను రద్దుచేసి 6 వారాలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఈనెల 1వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వం 1993 - 94 లో రిజర్వేషన్లు 69 శాతం ఉండాలని చట్టం తేవడం 1994లో పార్లమెంట్ 76వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో రిజర్వేషన్ 69 శాతానికి వర్తింపచేస్తూ 9 వ షెడ్యూల్ చేర్పించి గత 30 సంవత్సరాలుగా అమలు చేస్తున్న తీరును గమనించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 105, 1065 జీవోల ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ప్రయత్నించడం అవివేకమని, బీసీలను మభ్యపెట్టడానికే అని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే, నివేదిక అందకుండానే, అసెంబ్లీలో చట్టoను రూపొందించకుండా 34 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. ఇదే ప్రయత్నం 2019 - 20 లోనాటి వైఎస్సార్ సిపి ప్రభుత్వం కూడా చేసి అభాసు పాలైందన్నారు.
1992లోనే 9 మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యంగ ధర్మాసనం విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ 50 శాతం దాటకూడదని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనను విరమించుకుని డెడికేటెడ్ కమిషన్ నివేదికను సిద్ధం చేసుకుని, అసెంబ్లీలో చట్టo రూపొందించి, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ కోసం పోరాడాలని గుర్తు చేశారు.




