Guntur: గోరంట్ల కాపు హాస్టల్ రోడ్డు నిర్మాణానికి కమిషనర్ హామీ

Guntur: గుంటూరు గోరంట్లలోని కాపు హాస్టల్ రోడ్డును హెచ్ఎంఏ పథకం ద్వారా నిర్మిస్తామని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ వినతిపై జీఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Sept 2026 7:13 PM IST
Guntur
X

Guntur: గోరంట్ల కాపు హాస్టల్ రోడ్డు నిర్మాణానికి కమిషనర్ హామీ

Guntur: గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతంలో ఉన్న గుంటూరు కాపు హాస్టల్‌కు వెళ్లే రహదారిని త్వరితగతిన నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో, గుంటూరు కాపు హాస్టల్ కార్యదర్శి బాలిశెట్టి విజయకుమార్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

గత 12 సంవత్సరాలుగా గుంటూరు కాపు హాస్టల్‌ను గోరంట్ల ప్రాంతంలో నిర్వహిస్తూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి, భోజనం, విద్యా సదుపాయాలను అందిస్తున్నామని బాలిశెట్టి విజయకుమార్ తెలిపారు.

హాస్టల్‌కు చేరుకునే రహదారి ప్రస్తుతం మట్టి రోడ్డుగా ఉండటంతో వర్షాకాలంలో బురదమయంగా మారి విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా వర్షాల సమయంలో రహదారి పరిసరాల్లో పాములు సంచరించే పరిస్థితులు ఉండటంతో విద్యార్థుల భద్రతపై కూడా ఆందోళన నెలకొంటోందని తెలిపారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, రహదారి నిర్మాణం అత్యవసరతను డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ వినతిపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని HMA ప్రోగ్రామ్ ద్వారా రహదారి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థుల రాకపోకలకు ఎంతో కీలకమైన ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగడంతో పాటు విద్యార్థులకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని బాలిశెట్టి విజయకుమార్ తెలిపారు.

విద్యార్థుల సమస్యను సానుకూలంగా పరిగణించి, HMA ప్రోగ్రామ్ ద్వారా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కమిషనర్ కి బాలిశెట్టి విజయకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN