Guntur: ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగులకు సేవా గుణం మెండు: ఎమ్మెల్సీ లేళ్ల
Guntur: పదవీ విరమణ జీవితానికి ముగింపు కాదని, సమాజ సేవకు సరికొత్త ఆరంభమని ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
Guntur: ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగులకు సేవా గుణం మెండు: ఎమ్మెల్సీ లేళ్ల
Guntur: పదవీ విరమణతోనే జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లు కాదనీ... అక్కడి నుంచి సామాజిక స్పృహతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే ఎవరి జీవితానికైనా అర్థం - పరమార్థాన్ని ఆపాదించి పెడుతుందనీ... శాసనమండలి సభ్యులు, స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు విశాల దృక్పథం గల భారత ఆహార సంస్థ విశ్రాంత ఉద్యోగులే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన కొనియాడారు. సేవా గుణ సంపన్నతతో పాటు వారిలో మానవత్వం మెండని ఆయన తెలిపారు.
శనివారం అమరావతి రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో ఎఫ్‌సిఐ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, స్పూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తమకు మొదటి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండదండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని విశ్రాంత ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఎఫ్‌సిఐ విశ్రాంత ఉద్యోగులకు విశేష అనుభవంతో సామాజిక స్పృహ, సానుకూల దృక్పథం, సేవా తత్పరత అధికమని కొనియాడారు. నిస్వార్ధంతో కూడిన నిబద్ధతతో ముందుకు సాగే బందా రవీంద్రనాథ్ వ్యక్తిత్వమే అందుకు నిదర్శనమని కితాబిచ్చారు. పదవీ విరమణ తర్వాత కృష్ణా.. రామా.. అంటూ ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా తాను స్థాపించిన స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారని వివరించారు.
ఈ విషయంలో ఆయనతో పాటు అనేక మంది విశ్రాంత ఉద్యోగులు కూడా మేము సైతం అంటూ తమ స్పూర్తి ఉద్యమంలో భాగస్వాములైనట్లు ఆయన వెల్లడించారు. వారి సహాయ సహకారాలు మరువలేనివని పేర్కొంటూ.. వారే తన కుటుంబ సభ్యులని.. వారు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికై తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వారంతా ఇదే విధంగా ముందుకు సాగుతూ స్పూర్తి ఫౌండేషన్ కార్యక్రమాల్లో మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, భారత ఆహార సంస్థ ఉద్యోగులుగా తాము విశ్రాంతి తీసుకున్నామే తప్ప జీవితానికి కాదని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మానస పుత్రిక అయిన స్పూర్తి ఫౌండేషన్ ద్వారా సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి ఎఫ్‌సిఐ విశ్రాంత ఉద్యోగులతో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఆయన తెలిపారు. తమకు అవసరమైన అన్ని సమయాలలో ఆయన అండగా నిలిచినట్లు ఆయన వెల్లడించారు. నూనె ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎఫ్‌సిఐ విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలలో మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు నల్లయ్య, నాగమల్లేశ్వరి, రమణారెడ్డి, గోపిరెడ్డి, హరిప్రసాద్, రమణయ్య, ఖాన్, ఎలమంద, రవిచంద్ర ప్రసాద్, భూషణం, మూర్తి తదితరులు పాల్గొన్నారు.




