Mangalagiri: పోలీసులమని బెదిరించి రూ.15 లక్షల దోపిడీ: ముగ్గురు అరెస్ట్
Mangalagiri: ఎన్నికల కోడ్ తనిఖీల పేరుతో నకిలీ పోలీసులమని బెదిరించి రూ.15 లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Mangalagiri: పోలీసులమని బెదిరించి రూ.15 లక్షల దోపిడీ: ముగ్గురు అరెస్ట్
మంగళగిరి: పోలీసులమని బెదిరించి దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ కె. వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు.
గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీ కి చెందిన షేక్ అన్వర్ ఆరెంజ్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్నాడు.
అదే సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రఫీ ఉల్లా తన యజమాని అన్వర్ సూచన మేరకు రూ 15 లక్షల నగదును తన స్కూటీ డిక్కీలో నల్ల బ్యాగులో ఉంచుకొని కాజా టోల్గేట్ వద్దకు తీసుకువచ్చాడు. నగదు విషయాన్ని ముందుగానే తెలుసుకున్న యజమాని అన్వర్ వాహనానికి చెందిన డ్రైవర్ షేక్ జానీ తన స్నేహితులైన షేక్ సూరజ్, షేక్ నాగూర్ భాషలతో కలసి నగదు దోపిడీ చేసేందుకు పథకం రచించాడు.
పథకంలో భాగంగా షేక్ సూరజ్, షేక్ నాగూర్ భాషలు మఫ్టీ లో ఉన్న పోలీసులమని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు అక్రమంగా తరలిస్తున్నావని రఫీ ఉల్లాను బెదిరించి అతనితో గొడవ పెట్టుకుని చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను లాక్కొని నగదును బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు.
రఫీ ను అనుసరిస్తూ నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అతని స్కూటీని అడ్డగించి బెదిరించారు.
తరువాత షేక్ జానీ సూచన మేరకు సూరజ్, నాగూర్ భాషలు మరోసారి రఫీ ను అడ్డగించి అతనితో ఘర్షణకు దిగి చొక్కాను చించి చంపుతామని బెదిరించి స్కూటీ డిక్కీనీ బలవంతంగా పగలగొట్టి అందులో ఉన్న రూ.15 లక్షల నగదును నల్ల బ్యాగ్ తో సహా తీసుకొని విజయవాడ వైపు పారిపోయారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో గురువారం నిందితులు షేక్ జానీ, షేక్ రియాజ్, షేక్ నాగూర్ భాషాలను చినకాకాని రాజ్ కమల్ రోడ్డు లోని మర్రిచెట్టు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు తో పాటు రూ.15 లక్షల నగదు తో పాటు నేరానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.




