Bapatla: మురసు తుపాను అలర్ట్ బాపట్ల జిల్లా కలెక్టర్‌తో సీఎం సమీక్ష
Bapatla: మురసు తుపాను తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌తో సీఎం చంద్రబాబు వీక్షణ సమీక్ష. విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు.
Bapatla: మురసు తుపాను అలర్ట్ బాపట్ల జిల్లా కలెక్టర్‌తో సీఎం సమీక్ష
బాపట్ల: మురసు తుపాను హెచ్చరిక నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మురసు తీవ్ర తుపానుగా మారుతున్న తరుణంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, హాజరయ్యారు.
తుపాను ప్రభావం బాపట్ల జిల్లాపై అధికంగా చూపే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఎగువున ఉన్న జిల్లాల నుంచి వర్షం నీరు పంట కాల్వల ద్వారా బాపట్ల జిల్లాలోకి అధికంగా వరద నీరు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. పంట కాల్వల్లోకి నాలుగు రోజులపాటు వరద నీరు భారీగా చేరే అవకాశం ఉన్నందున, కాల్వ గట్లను పరిశీలించుకోవాలన్నారు. వరద నీటితో ప్రమాదం పొంచి ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బాపట్ల జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని సూచించారు. మురసు తుపానుతో అపార నష్టం వాటిల్లకుండా, మంచి నాయకత్వంతో పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయక చర్యలలో ప్రజల సహకారం తీసుకోవాలన్నారు.
తుపాను నష్టాన్ని బాపట్ల జిల్లాలో సమర్ధంగా ఎదుర్కోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులంతా సమన్వంతో పనిచేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో వర్షపాతం 30శాతం తక్కువగా నమోదఅయ్యిందన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కొరకు 50 మందిని గోదావరి జిల్లాకు పంపమన్నారు.
మురసు తుపాను ప్రభావం ఐదు రోజులపాటు బాపట్ల జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తుపానుతో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో కురిసే వర్షం, కాల్వల ద్వారా బాపట్ల జిల్లాలోకి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనాలు వేశామన్నారు.
పంట కాల్వలన్ని పూర్తిగా పొంగిపారే అవకాశం ఉండగా, పంట కాల్వలు, రహదారులు చెరువుల గట్లు 74 ప్రాంతాలలో దెబ్బతినే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. ఒక వెయ్యి విద్యుత్ స్తంభాలు, యంత్రాలు సిద్ధంగా ఉంచామని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే గుర్రపు డెక్క తొలగించి, గట్లు బలోపేతం చేస్తున్నామన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.
మురసు తుపాను హెచ్చరిక నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల అన్నిటికి రెండు రోజులు సెలవులు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. తుపానుతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇచ్చిన సూచన మేరకు ఈ నెల 2, 3 తేదీలలో సెలవులు ఇస్తున్నామన్నారు. విద్యా సంస్థలేవి పనిచేయరాదన్నారు. సెలవును తక్షణమే అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల యజమానులను ఆదేశించారు.




