Guntur: బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యానికి సీపీఐ పెద్దపీట: ముప్పాళ్ల!
Guntur: గుంటూరు అశోక్ నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రారంభించారు.
Guntur: బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యానికి సీపీఐ పెద్దపీట: ముప్పాళ్ల!
Guntur: బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యానికి సిపిఐ పెద్దపీట వేస్తుందని జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ సమితి పేరుతో గతంలో జిల్లా స్థాయిలో సుమారు నాలుగు వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు.
సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలలో భాగంగా శనివారం స్థానిక అశోక్ నగర్ లో ఉన్న ఎర్రజెండా సెంటర్ నందు సురక్ష హాస్పిటల్స్ సౌజన్యంతో..శంకర కంటి హాస్పటల్, జిల్లా అందత్వ నివారణ సంస్థల సహకారంతో సిపిఐ నగర సమితి కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది.
ఈ సందర్భంగా చిన్నపిల్లలు, మహిళా సంబంధిత సమస్యలకు, ఎముకలు, కీళ్లు, నరాలు, జాయింట్ రీప్లేస్మెంట్, క్రిటికల్ కేర్, మానసిక ఆరోగ్య పరీక్షలు, బీపీ, షుగర్ తదితర వైద్య సేవలు ఈ శిబిరం నందు నిర్వహించారు. శంకర్ కంటి హాస్పటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల నిర్వహించి అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్లు, అతి తక్కువ ధరలకే కళ్ళజోళ్ళు, అలాగే బిపి, షుగర్ పరీక్షల నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు.
ఈ క్యాంపుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉచిత విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని కోరిన పార్టీ సిపిఐ పార్టీ అని, ఈ అంశంపై సిపిఐ చేపట్టిన ఆందోళన ఫలితంగానే అధికార పార్టీలు నేడు పేద ప్రజలకు కొంతమేరకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
వివిధ పేర్లతో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న పథకాల పేర్లకు బదులు జాతీయ స్థాయి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల, సంఘ సేవకుల పేర్లు పెడితే బాగుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో పొన్నెకల్లులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు 1525 మంది పాల్గొని తమ ఆరోగ్యాలను పరీక్షించుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా గుంటూరు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో శంకర్ కంటి హాస్పటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి భవిష్యత్తులో సిపిఐ మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అలాగే కొత్తపేట మల్లయ్యలింగం భవన్ లో ఉన్న సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రతి ఆదివారం మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వాలు చేతులు దులుపుకునే పరిస్థితులు రానున్నాయన్నారు.
అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గుంటూరు పట్టణంలో సిపిఐ అనేక వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. శంకర్ కంటి హాస్పటల్ సహకారంతో.. అంధత్వ నివారణ సంస్థ ద్వారా గుంటూరు పట్టణంలో ఇప్పటికే సుమారు 50 మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత కార్పొరేట్ హవాలో ప్రజలు హాస్పిటల్స్ కి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి నేపథ్యంలో విద్యా, వైద్యాన్ని ప్రతి పేదవారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిమిత్తం అశోక్ నగర్ లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. సురక్ష హాస్పిటల్ అధినేత, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రగతిరెడ్డి పోశం మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, హైకోర్టు లాయర్ హరగోపాల్ ల సహకారంతో డాక్టర్ నిరంజన్ స్ఫూర్తితో సురక్ష హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పేదవారికి ఉపయోగపడే ఏ సేవలనైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేడు విద్య, వైద్యం కమర్షియల్ అయిన తరుణంలో ప్రజల శ్రేయసే సిపిఐ లక్ష్యంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. నిరుపేదలు నివసించే కాలనీలో గతంలో సిపిఐ మరికొందరి వైద్యుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
హైకోర్టు లాయర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రజా అవసరాలు తీర్చేందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. శంకర కంటి వైద్యశాల క్యాంపు ఇన్చార్జి రవికాంత్ మాట్లాడుతూ పార్టీలు, మతాలకు అతీతంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ శాఖ కార్యదర్శి ఆకిటి రామచంద్రుడు, సిపిఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ గుంటూరు నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, పరిమళ బన్నీ, బి. వెంకటేశ్వరరెడ్డి, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని సిపిఐ నాయకులు అప్పమ్మ ఆకిటి శివకుమార్, అనిల్ కుమార్, గోపాలకృష్ణ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




