Guntur: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: కలెక్టర్ సాయికాంత్

Guntur: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ విజిలెన్స్ సమావేశంలో స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Sept 2026 6:32 PM IST
Guntur
X

Guntur: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: కలెక్టర్ సాయికాంత్

గుంటూరు: ఎస్.సి, ఎస్.టి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ లేని యానాది కులానికి చెందిన 531 మందిని గుర్తించామని, డొమిసిల్ సర్టిఫికెట్ తహసిల్దార్ నుండి ఇప్పించి ఆధార్ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు.

గిరిజన భవన్ మరమ్మతుల పనులు

మంజూరు చేశామని అన్నారు. అంబేద్కర్ భవన్ పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందించుటకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని అన్నారు. జిల్లాలో మార్పు కార్యక్రమం ప్రత్యేకంగా తీసుకున్నామని, ఈ కార్యక్రమంలో వసతి గృహాలు, ముఖ్యంగా ఎస్.సి, ఎస్.టి వసతి గృహాలలో అన్ని వసతులు కల్పించాలని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఎస్.సి, ఎస్.టి అభ్యర్థులపై జరిగే దాడులపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మొత్తం కేసులు, డ్రాప్ చేసిన కేసులు వివరాలు కూడా సమావేశంలో అందించాలని పోలీసు శాఖను ఆదేశించారు. పంచర్ ప్రూఫ్ గ్లౌస్ లు పారిశుధ్య కార్మికులకు అందించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ దుకాణాలు నిబంధనల మేరకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

వసతి గృహాలలో మెనూ పక్కాగా, నాణ్యమైన ఆహార పదార్థాలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్.సి, ఎస్.టి మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఆ మేరకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిర్దేశిత సమయంలో న్యాయం లబ్ధిదారులకు అందించేందుకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో సునిశితమైన కేసుల వివరాలు పోస్టు చేయరాదని స్పష్టం చేశారు.

ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో కేసులు ఉండకుండా, కేసులు సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛను మంజూరు చేయుటకు విద్యుత్ కనెక్షన్ నంబర్ విధిగా ఉండాలని ఎస్.జి.ఎస్.డబ్ల్యు సిబ్బంది అంటున్నారని దానిపై దృష్టి సారించాలని కోరారు. ఎస్.సి, ఎస్.టి చట్టాలపై మరింత అవగాహనను పోలీసు శాఖకు అందించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ జూలై నుండి ప్రత్తిపాడులో కేసు పెడుతుంటే తీసుకోవడం లేదన్నారు. అనునిత్యం అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పంచర్ ప్రూఫ్ గ్లౌస్ లు పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు. ఎస్.సి, ఎస్.టిలకు మంజూరు చేసిన దుకాణాలు, వారే అనుభవించేటట్లు చూడాలని, లబ్ధిదారులు ఇతరులకు ఇచ్చినా చర్యలు తీసుకోవాలని కోరారు. వసతి గృహాలలో ఆహార పదార్థాలు నాణ్యత మెరుగు పరుచుటకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా సాంఘిక సంక్షేమ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి.దుర్గాబాయి, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు, డి.ఎస్.పిలు, కమిటీ సభ్యులు అనురాధ, గుడెపు అశ్వినీ కుమార్, హేమలత, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN