Chirala: చీరాల కొత్తపేట పంచాయతీ పోరు.. స్థానికుడా? స్థానికేతరుడా?

Chirala: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 29 Nov 2026 8:24 AM IST
Chirala
X

Chirala: చీరాల కొత్తపేట పంచాయతీ పోరు.. స్థానికుడా? స్థానికేతరుడా?

Chirala: చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నాయకుల మద్దతు ఒకరికి ఉంటే, రాజకీయ పార్టీల అండ మరొకరికి ఉంది.

ఇంకొకరు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవాన్ని నమ్ముకుంటున్నారు. మరికొందరు విద్యార్హతలు, సామాజిక సేవా కార్యక్రమాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. దీంతో కొత్తపేట ఎన్నికల పోరు సాధారణ పంచాయతీ ఎన్నికలను తలపించకుండా రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది.

అనుభవమే అస్త్రంగా స్వతంత్ర అభ్యర్థి వాసు

మాజీ ఎంపీటీసీ సభ్యుడిగా, గతంలో సర్పంచ్‌గా పనిచేసిన చుండూరు వాసు తన రాజకీయ, పరిపాలనా అనుభవాన్ని ప్రధాన బలంగా భావిస్తున్నారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు, పంచాయతీ పాలనపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన వర్గీయులు అంటున్నారు.

గత 13 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగని పరిస్థితుల్లోనూ వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాడని చెబుతున్నారు. గత అనుభవం, గ్రామ ప్రజలతో ఉన్న పరిచయాలు ఓట్ల రూపంలో తనకు మద్దతుగా మారుతాయని వాసు ఆశిస్తున్నారు.

సేవా కార్యక్రమాలే బలంగా బీజేపీ అభ్యర్థి దేవరాజు..

బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తాడివలస దేవరాజు యువతపై, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆశలు పెట్టుకున్నారు. చీరాల, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానికంగా గుర్తింపు పొందినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగిన దేవరాజు పార్టీ మద్దతుతో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

విద్యార్హతలు, సేవా దృక్పథంతో రామ్మూర్తి

గునుకుల రామ్మూర్తి

కూడా ఎన్నికల బరిలో తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీటెక్, ఎల్‌ఎల్‌బీ విద్యార్హతలు కలిగిన ఆయన మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు.

గ్రామంలో నివాసం ఉండటంతో పాటు స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలు, గ్రామ సమస్యలపై అవగాహన తనకు కలిసివస్తాయని ఆయన వర్గీయులు విశ్వసిస్తున్నారు. విద్యావంతుడైన నాయకత్వం, అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచనలకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

కూటమి బలంతో తన్నీరు ప్రసాద్ వ్యూహం

కూటమి బలపరిచిన అభ్యర్థిగా తన్నీరు ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిని అనుసరిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ప్రచారాన్ని వేగవంతం చేసిన ఆయన స్థానిక ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక నాయకుల సహకారంతో పాటు సినీ రంగానికి చెందిన వ్యక్తులను కూడా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా భాగస్వాములను చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

అయితే తక్కువ సమయంలో ఏర్పడిన పరిచయాలు, ఇతర ప్రాంతాల వ్యక్తుల ప్రచార హడావుడి ఓట్లుగా ఎంతవరకు మారతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్థానికుడా, స్థానికేతరుడా? ఇదే ప్రధాన చర్చ?

కొత్తపేట ఎన్నికల్లో ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న స్థానికత. గ్రామంలోనే నివసిస్తూ ప్రజల సమస్యలకు అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటు వేయాలా? లేక రాజకీయ బలం, నాయకుల మద్దతు, ప్రచార ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? అన్న చర్చ గ్రామంలో కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య స్థానిక పరిచయాలు, గ్రామంతో ఉన్న అనుబంధం, భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండే సామర్థ్యం కీలక అంశాలుగా మారాయి.

నోటు ప్రభావమా, ప్రజాసేవకు పట్టమా?

ఎన్నికల వేళా సర్పంచ్ అభ్యర్థి ఖర్చు ఎంత ప్రస్తుతం ఇప్పటి వరకు సర్పంచ్ అభ్యర్థులు చేస్తున్న ఖర్చు ఎంత

ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్తపేట ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. పైసా మే పరమాత్మ అన్నట్లుగా సాగుతున్న రాజకీయ వాతావరణంలో నోటు ప్రభావం ఓటుపై పడుతుందా? లేక అభ్యర్థుల వ్యక్తిత్వం, గత సేవలు, గ్రామాభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సర్వేలకు అందని ఓటరు నాడి తుది తీర్పు పై ఉత్కంఠ ?

సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ పోటీలో ఉండటంతో ఓట్ల చీలిక ఎవరికి అనుకూలంగా మారుతుందో అంచనా వేయడం రాజకీయ విశ్లేషకులకు సైతం సవాలుగా మారింది. స్థానిక నాయకుల మద్దతు ఒకరికి, పార్టీ బలం మరొకరికి, గత అనుభవం ఇంకొకరికి సేవా కార్యక్రమాలు ఇంకొకరికి ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో కనిపిస్తున్న జనసందోహం, నాయకుల హామీలు, సర్వేల అంచనాలు వాస్తవ ఓటరు నిర్ణయాన్ని ప్రతిబింబిస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చివరికి కొత్తపేట ప్రజలు ఎవరిని తమ గ్రామ పాలకుడిగా ఎన్నుకుంటారు? గెలిచిన అభ్యర్థి అయినా, ఓడిపోయిన అభ్యర్థి అయినా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు? స్థానిక నాయకుల మద్దతు ఎవరికి విజయాన్ని అందిస్తుంది? రాజకీయ సమీకరణాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అన్న ప్రశ్నలకు ఓటరు తీర్పే సమాధానం చెప్పనుంది.

మొత్తానికి కొత్తపేట ఎన్నికలు కేవలం సర్పంచ్ పదవి కోసం జరుగుతున్న పోటీ మాత్రమే కాదు. స్థానికత, రాజకీయ పలుకుబడి, అనుభవం, సేవా దృక్పథం, ఓటరు ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన రాజకీయ పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితం చీరాల నియోజకవర్గ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala