Vinukonda: విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తనిఖీ చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలార్లపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Vinukonda: విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తనిఖీ చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లినిక్‌లోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మందుల నిల్వలను పరిశీలించడంతో పాటు హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. క్లినిక్‌కు కేటాయించిన వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. అలాగే నూజెండ్ల మండలంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో తలార్లపల్లి క్లినిక్ ఏ ర్యాంకులో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సూచించారు.
క్లినిక్‌కు వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి, ప్రజలకు జవాబుదారీతనంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత అందుబాటులో ఉండేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




