Guntur: నీట్ టాపర్ ఝాన్సీకి చేయూత ఫౌండేషన్ రూ. లక్ష ఆర్థిక సాయం!

Guntur: అచ్చంపేటకు చెందిన మేకల కాపరి కుమార్తె, నీట్ విజేత గుడేలి ఝాన్సీకి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన చేయూత ఫౌండేషన్, బీపీ మండల్ ట్రస్ట్ మరియు కనెక్ట్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Oct 2026 1:22 PM IST
Guntur
X

Guntur: నీట్ టాపర్ ఝాన్సీకి చేయూత ఫౌండేషన్ రూ. లక్ష ఆర్థిక సాయం!

Guntur: గుంటూరు నగరంలో వివిధ పౌర సంస్థల ఉమ్మడి వేదికగా ఏర్పడిన కనెక్ట్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు కనెక్ట్ కో ఆర్డినేటర్, చేయూత ఫౌండేషన్ కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 14వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షులు డా ఆలా వెంకటేశ్వర్లు, నేస్తం సహ వ్యవస్థాపకులు తమ్మా ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తూ పేదరికాన్ని అనుభవిస్తున్న గుడేలి ఝాన్సీ ఎలాంటి శిక్షణ లేకుండానే అత్యున్నత ప్రతిభతో నీట్ 2026 జాతీయ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీపీ మండల్ ట్రస్ట్, చేయూత ఫౌండేషన్, కనెక్ట్ సంస్థలు గుడేలి ఝాన్సీ ఒక సంవత్సరం వైద్య విద్యను అభ్యసించేందుకు అవసరమైన లక్ష రూపాయలను పంపినామని తెలిపారు. బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షులు డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూత నివ్వడం అత్యంత సంతృప్తిని కలిగిస్తుందని, గుంటూరు నగరంలోని సేవా తత్పరులు, సేవా సంస్థలు ముందుకొచ్చి పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులకు బాసటగా నిలవాలని కోరారు.

నేస్తం ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు తమ్మా ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ నేస్తం, మానవత, కోవిడ్ ఫైటర్స్, కార్మెల్ సేవా సదన్, రేట్ పేయర్స్ అసోసియేషన్, రెడ్ క్రాస్, చేయూత లాంటి పౌర సేవా సంస్థలు గుంటూరు నగరంలోని బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణను పొందుతున్నాయని తెలిపారు. ఈనెల 18వ తేదీన ఆదివారం ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌర సేవా సంస్థల భాగస్వామ్యంతో గత 10 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో 15 వేలకు పైగా మొక్కలు నాటి సంరక్షిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి కి అభినందన సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN