Guntur: అనుమతి మేరకే నిర్మాణాలు జరగాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరంలో అనుమతి మేరకే నిర్మాణాలు జరగాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
Guntur: అనుమతి మేరకే నిర్మాణాలు జరగాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో నిర్మాణాలు అనుమతి మేరకే జరిగేలా పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం దుర్గానగర్, అలీ నగర్, ఐపిడి కాలనీ, బొంతపాడు రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దుర్గా నగర్ ప్రాంతంలో అనుమతించిన ప్లాన్‌కు భిన్నంగా చేపట్టిన నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు.
ప్రతి నిర్మాణం కూడా నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్లాన్ మేరకే జరగాలని స్పష్టం చేశారు. అనుమతి లేని అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షణ వహించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నిర్మాణం వద్ద జిఎంసి నుండి పొందిన ప్లాన్ తప్పనిసరిగా డిస్ప్లే చేయాలన్నారు.
అనంతరం అలీ నగర్, సుద్దపల్లి డొంక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రజారోగ్య అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా జరగాలని, ఎక్కడా చెత్త నిల్వ ఉండే పాయింట్లు కనిపించడానికి వీలులేదన్నారు. అలాగే దోమల నివారణకు ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిపై క్రమం తప్పకుండా ఆయిల్ స్ప్రే చేయాలని బయాలజిస్ట్‌ను ఆదేశించారు.
అలాగే వివిధ ప్రాంతాల్లో చేపడుతున్నఅభివృద్ధి పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టెండర్లు పూర్తయి, అనుమతులు పొంది కూడా ఇప్పటివరకు ప్రారంభించని అభివృద్ధి పనులను రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర ప్రజలకు మెరుగైన సేవలందించడంలోనూ, నిబంధనల అమలులోనూ నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, ఏసిపీ జకిరా, డిఈఈ హనీఫ్, ఎస్ఎస్ ఐజాక్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.




