Vinukonda: స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి!

Vinukonda: శావల్యాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.

KAREEMULLA, VINUKONDA
Published on: 24 Sept 2026 5:36 PM IST
Vinukonda
X

Vinukonda: స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి!

Vinukonda: శావల్యాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా బలంగా ఎగరాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం మండలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలకు చేసిన మేలే పార్టీకి బలమని అన్నారు.

ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ధైర్యంగా ప్రతి గ్రామానికి వెళ్లాలని సూచించారు.కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని బొల్లా ఆరోపించారు. నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి కంటే శిలాఫలకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు.

డీఎస్సీ అంశంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు, దాడులతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెట్టినా, తాను ఎలాంటి ఒత్తిడికీ భయపడనని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల సమయంలో శావల్యాపురం మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తానే స్వయంగా వస్తానన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA