Vetapalem: ఆమంచి కృష్ణమోహన్ నివాసం ఎదుట అనుమానాస్పద వ్యక్తుల కలకలం!

Vetapalem: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసం ఎదుట మూడు కార్లలో వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల సంచారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 27 Nov 2026 3:11 PM IST
Vetapalem
X

Vetapalem: ఆమంచి కృష్ణమోహన్ నివాసం ఎదుట అనుమానాస్పద వ్యక్తుల కలకలం!

వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ నివాసం ఎదుట మూడు కార్లలో వచ్చిన కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరించడం కలకలం రేపింది.

ఆమంచి నివాసానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ కారు ఆగడంతో అప్రమత్తమైన స్థానిక గ్రామస్తులు కారులో ఉన్న యువకులను ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, కారులో ఉన్న వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రశ్నించిన గ్రామస్తులపై కత్తితో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దీంతో గ్రామస్తులు కేకలు వేస్తూ అప్రమత్తం కావడంతో రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. మరో కారును అడ్డుకున్న గ్రామస్తులు అందులోని ముగ్గురిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు తప్పించుకోగా, ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన కారులో కత్తులు, కర్రలు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించినట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆమంచి కృష్ణమోహన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక గ్రామస్తులు చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను పోలీసులకు అప్పగించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు, ఆమంచి కృష్ణమోహన్‌పై రెక్కీ నిర్వహించేందుకే ఈ వ్యక్తులు వచ్చారా అన్న అనుమానాలను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఏమిటి? వచ్చిన వ్యక్తుల లక్ష్యం ఏమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పందిళ్లపల్లి ఘటనతో చీరాల ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయంగా, సామాజికంగా చర్చ మొదలైంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala