Bapatla: సూర్యాస్తమయం తర్వాత సముద్రంలోకి దిగరాదు ఎస్పీ ఉమామహేశ్వర్

Bapatla: బాపట్ల జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ఉమామహేశ్వర్. సూర్యాస్తమయం తర్వాత సముద్రంలోకి దిగవద్దని భక్తులకు హెచ్చరిక.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 18 Sept 2026 11:55 PM IST
Bapatla
X

Bapatla: సూర్యాస్తమయం తర్వాత సముద్రంలోకి దిగరాదు ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల: సూర్యాస్తమయం తర్వాత సముద్ర తీరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రమాదకరమని, రాత్రి వేళల్లో భక్తులు ఎవరూ సముద్రంలోకి దిగకుండా క్రేన్ ద్వారా మాత్రమే గణేష్ నిమజ్జనం నిర్వహించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ తెలిపారు.

సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వాడరేవు, రామాపురం సముద్ర తీరాల వద్ద గణేష్ ప్రతిమల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... బాపట్ల జిల్లాలో సముద్ర తీర ప్రాంతం, కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో బాపట్ల జిల్లాతో పాటు సమీప జిల్లాలైన పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా భక్తులు గణేష్ ప్రతిమల నిమజ్జనం కోసం జిల్లాకు వస్తుంటారన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 86 నిమజ్జన ప్రదేశాలను అధికారికంగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లాలో ప్రధానంగా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుమూడి వారధి, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యలంక బీచ్, చీరాల రూరల్, వేటపాలెం పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని వాడరేవు, రామాపురం బీచ్, పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరాల్లో జిల్లా పరిధిలోని వినాయక విగ్రహాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిమజ్జన ప్రదేశాలకు వాహనాలు సులభంగా వచ్చి వెళ్లేలా మార్గాలను సుగమం చేశామన్నారు. ప్రతి ప్రాంతంలో పోలీస్ సిబ్బందితో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆల్ టెరైన్ వాహనాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తూ భక్తులకు అవసరమైన సూచనలు ఇస్తున్నామన్నారు.

వాచ్ టవర్ల ద్వారా ఎవరైనా సముద్రంలో లోతైన ప్రాంతాలకు వెళ్తున్నారో లేదో నిరంతరం గమనిస్తున్నామన్నారు. ఫైర్, మెరైన్ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడంతో పాటు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది సూచనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకుని, క్షేమంగా తిరిగి వెళ్లాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

భక్తులకు జిల్లా ఎస్పీ సూచనలు:

* మద్యం సేవించి ఎవరూ సముద్రంలోకి దిగరాదు.

* నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఈత కోసం సముద్రంలోకి లోతుగా వెళ్లకూడదు.

* చిన్నపిల్లలను, వృద్ధులను ఉత్సవ కమిటీ సభ్యులు నిరంతరం గమనిస్తూ ఉండాలి.

* దూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తులు వీలైనంత త్వరగా సముద్ర తీరానికి చేరుకోవాలి.

* పోలీసులు నిర్దేశించిన, భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి.

* సూర్యాస్తమయం తర్వాత నిమజ్జనం కోసం వచ్చే వారు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన క్రేన్ సౌకర్యాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి.

* సూర్యాస్తమయం తర్వాత ఎవరూ సముద్రంలోకి దిగే ప్రయత్నం చేయరాదు.

* నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాలి. ప్రధాన రహదారులపై అస్తవ్యస్తంగా వాహనాలను పార్క్ చేయకూడదు.

*పోలీస్ వారి సూచనలను తప్పక పాటించాలి.

* నిమజ్జనానికి వచ్చిన భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమీపంలోని పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్లు 112, 100కు కాల్ చేసి సమాచారం అందించి, పోలీసుల సహాయం పొందాలన్నారు. ప్రజలకు, భక్తులకు సహాయం చేసినందుకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala