Bapatla: బాపట్ల జిల్లా మార్టూరులో ఏసీబీ అధికారుల మెరుపు దాడి
Bapatla: బాపట్ల జిల్లా మార్టూరులో భూమి మ్యుటేషన్ కోసం రూ.9 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్వో రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
Bapatla: బాపట్ల జిల్లా మార్టూరులో ఏసీబీ అధికారుల మెరుపు దాడి
బాపట్ల: బాపట్ల జిల్లా మార్టూరులో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. భూమి మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారి (VRO) ఏసీబీ వలకి చిక్కారు. బాధితుడి నుంచి తొమ్మిది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు గుంటూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో మార్టూరులో ఈ ఆపరేషన్ చేపట్టారు. మార్టూరు మండలం బోల్లపల్లి గ్రామానికి చెందిన దూళిపాళ్ల సుబ్బారావు, తన పేరిట అలాగే తన సోదరి వెంకాయమ్మ పేరిట తమ తండ్రి రాములు పేరు మీద ఉన్న భూమిని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పనులను పరిశీలించి, వీరికి అనుకూలంగా నివేదిక ఇచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఆమోదం పొందేందుకు వల్లపల్లి వీఆర్వో పేళ్ళ చిన ఆంజనేయులు మొదట పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని వేడుకోవడంతో, వెయ్యి రూపాయలు తగ్గించి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రహదారిపై సుబ్బారావు వద్ద నుంచి వీఆర్వో చిన ఆంజనేయులు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.




