Bapatla: 1,188 మంది పోలీసులతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బందోబస్తు

Bapatla: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,188 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. శాంతిభద్రతల పరిరక్షణకు 'సమర్థ్' యాప్ వినియోగం: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్.

Bakka Deepak, Bapatla
Published on: 4 Nov 2026 7:25 PM IST
Bapatla
X

Bapatla: 1,188 మంది పోలీసులతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బందోబస్తు

బాపట్ల: బాపట్ల జిల్లాలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించి, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా 1188 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన కోసం సమర్థ్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

బుధవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, బందోబస్తు ఏర్పాట్లు, సమర్థ్ మొబైల్ యాప్ వినియోగం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ పార్టీలు, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1188 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు 337 మంది స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు, పదవీ విరమణ పొందిన ఆర్మీ ఉద్యోగులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను సైతం ఎన్నికల విధుల్లో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ఉదయం 6 గంటలకే విధులకు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ఎవరు గుంపులుగా ఉండకుండా సున్నపు గీత ఏర్పాటు చెయ్యాలన్నారు. క్యూలైన్లు సక్రమంగా ఏర్పాటు చెయ్యాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలన్నారు. ప్రతి ఒక్కరూ విధుల్లో భాగంగా విజిల్‌ను తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాలని, క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడంలో విజిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి నిత్యం అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో సమర్థ్ మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకుని, అందులో లాగిన్ అయి సిద్ధంగా ఉంచుకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు సమీపంలోని మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

పోలింగ్ కేంద్రం వద్ద లేదా గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమర్థ్ యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే, వెంటనే సమీపంలోని మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌తో పాటు జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్‌లు చేరుతాయని వివరించారు. ఈ అలర్ట్‌లు వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికల తరహాలో మొబైల్ ఫోన్లలో వైబ్రేషన్‌తో పాటు సైరన్ శబ్దం ద్వారా అందుతాయని తెలిపారు.

SOS అలర్ట్ అందిన వెంటనే సంఘటనా స్థలానికి సంబంధించిన 30 సెకన్ల వీడియో రికార్డింగ్‌తో పాటు అక్కడి పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్, సంబంధిత సిబ్బంది లొకేషన్ వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, సమీపంలోని మొబైల్, స్ట్రైకింగ్ బృందాలకు చేరుతాయని తెలిపారు. తద్వారా సంఘటనా స్థలంలో నెలకొన్న పరిస్థితులను తక్షణమే అంచనా వేసి, సమీపంలోని పోలీస్ బృందాలు వేగంగా అక్కడికి చేరుకుని శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వీలవుతుందన్నారు.

గతంలో ఉన్న విధానానికి అదనంగా సమర్థ్ యాప్‌లో కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా అత్యవసర అలర్ట్‌లు మొబైల్ ఫోన్లకు వైబ్రేషన్, సైరన్ శబ్దంతో చేరుతాయని, తద్వారా పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు, వారి ప్రస్తుత లొకేషన్ ఏమిటనే వివరాలను జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

బాపట్ల జిల్లాలో 351 గ్రామాలలో 593 పోలింగ్ లొకేషన్లలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 138 సెన్సిటివ్, 92 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 593 పోలింగ్ లొకేషన్లలను 29 జోన్ లు, 78 రూట్ లుగా విభజించుకోవడం జరిగిందన్నారు.

గతంలో నేరాలకు పాల్పడిన, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,646 మందిని గుర్తించి, ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల విధుల కోసం మొత్తం 1188 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించామని, వీరిలో 3 డీఎస్పీలు, 18 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు స్వర్ణ గ్రామ/వార్డు మహిళా పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఆర్మీ ఉద్యోగులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు వివరించారు.

అడిషనల్ ఎస్పీ, 4 గురు డిఎస్పీలతో స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 18 స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ పార్టీలు, 78 రూట్ మొబైల్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, ఘర్షణలకు పాల్పడినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలని సూచించారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla