Guntur: వాస్తవ విస్తీర్ణం మేరకే భూ సమీకరణ: కలెక్టర్ సాయికాంత్ వర్మ

Guntur: అమరావతి రెండో విడత భూ సమీకరణలో రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకే భూములు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 2:58 PM IST
Guntur
X

Guntur: వాస్తవ విస్తీర్ణం మేరకే భూ సమీకరణ: కలెక్టర్ సాయికాంత్ వర్మ

గుంటూరు: రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు మాత్రమే భూ సమీకరణలో భూములు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. అమరావతి రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామంలో భూసమీకరణపై బుధవారం జరిగిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా వాస్తవంగా ఉన్న భూమిని భూ సమీకరణలో తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

స్పష్టమైన హద్దులను పత్రాలు ఆధారంగా చూపించాలని కోరారు. భూ సమీకరణకు భూమిని ఇచ్చే రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్, భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్ పత్రాలు, ఆధార్ లింక్ చేసిన ఫోన్ నెంబర్, రెండు ఫోటోలు సమర్పించాలని కోరారు. డొంక రోడ్లు, ప్రభుత్వ భూమి కలిసిన భూములు ఉంటే వాటి వాస్తవ విస్తీర్ణం మేరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ భూమి కలిపి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు.

రైతులు మాట్లాడుతూ తమ వద్ధ దీర్ఘకాలం నుండి ఉన్న భూమి పత్రాలలో కొలతలు, రీ సర్వేలో వస్తున్న పత్రాలలో కొలతలు తేడాలు వస్తున్నాయని వివరించారు. కొన్ని భూములకు చెరువు పడకగా చూపిస్తున్నాయని వాటిని సరి చేయాలని సూచించారు.

ఈ గ్రామ సభలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, తహసిల్దార్ హరిబాబు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN