Kukunoor: కుకునూరులో సున్నిత ప్రాంతాల పరిశీలన: డీఎస్పీ రవిచంద్ర
Kukunoor: ఏలూరు జిల్లా కుకునూరు మండలంలో స్థానిక ఎన్నికల భద్రతపై పోలవరం డీఎస్పీ యు. రవిచంద్ర సున్నిత ప్రాంతాలను పరిశీలించి ముందస్తు చర్యలు సమీక్షించారు.
Kukunoor: కుకునూరులో సున్నిత ప్రాంతాల పరిశీలన: డీఎస్పీ రవిచంద్ర
ఏలూరు జిల్లా, కుకునూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ యు. రవిచంద్ర కుకునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమావేశమైన డీఎస్పీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాల నిర్వహణపై చర్చించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
భయాందోళనలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి!
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని భద్రతా చర్యలు చేపడుతోందని డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.




