Polavaram: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దినేష్ కుమార్!

Polavaram: పోలవరం జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల్లో సీసీ కెమెరాల నిఘా పెట్టాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.

Prasanna, Rampachodavaram
Updated on: 10 Nov 2026 10:14 PM IST
Polavaram
X

Polavaram: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దినేష్ కుమార్!

పోలవరం: జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) చైర్మన్ కె. దినేష్ కుమార్ ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వ, విక్రయాల నిర్వహణతో పాటు అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, పోలవరం జిల్లా సరిహద్దుల నుంచి పొరుగు రాష్ట్రాలకు అనుసంధానమయ్యే రహదారి మార్గాల ద్వారా ఇసుక అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల రహదారుల్లో అవసరమైన ప్రదేశాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పరస్పరం అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా గుమ్మలయ్యగూడెం ఇసుక రీచ్, గుండాల స్టాక్ యార్డులను కార్యకలాపాలకు సిద్ధం చేసేందుకు అవసరమైన తవ్వకం, లోడింగ్ ఏజెన్సీలను గుర్తించాలని జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. సంబంధిత అనుమతులు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసి ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డులు సక్రమంగా నిర్వహణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో ఇసుక సరఫరా సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు అక్రమ తవ్వకాలు, అక్రమ నిల్వలు, అనధికార రవాణాకు ఎలాంటి అవకాశం లేకుండా సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇసుక నిర్వహణ జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ లు డి పృథ్వి రాజ్ కుమార్, సీహెచ్. నరేంద్ర పడాల్, పోలవరం జిల్లా ఇంచార్జి మైన్స్ ఏ డి జి. కృష్ణ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram