Nuzvid: ఏలూరు జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్!

Nuzvid: ఏలూరు జిల్లాలో పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కలెక్టర్ వేట్రీసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 12:01 PM IST
Nuzvid
X

Nuzvid: ఏలూరు జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్!

Nuzvid: ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా,ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

ఎన్నికల అధికారులు,పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా చేపట్టిన ముందస్తు చర్యల వల్ల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో గురువారం ఉదయం ఏడు గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది.గ్రామంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా,ప్రారంభంలో నిదానంగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ లైన్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా మహిళలు,వృద్ధులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

స్థానిక పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.కేవలం నూజివీడు మండలంలోనే కాకుండా,ఏలూరు జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సరళి నిలకడగా సాగుతోంది.సమస్యాత్మక,అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.

నిష్పక్షపాతంగా,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పలు కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్,సీసీ కెమెరాల ద్వారా జిల్లా నియంత్రణ గది (కంట్రోల్ రూమ్) నుండి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మరియు జిల్లా కలెక్టర్ వేట్రీసెల్వి పోలింగ్ సరనని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్