Nuzvid: నూజివీడులో మున్సిపల్ కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన!
Nuzvid: నూజివీడు శ్రీ సారధి ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
Nuzvid: నూజివీడులో మున్సిపల్ కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన!
Nuzvid: నూజివీడు పట్టణ పరిధిలోని శ్రీ సారధి ఇంజనీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ హాల్ మరియు స్ట్రాంగ్ రూమ్‌లను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సంయుక్తంగా శనివారం పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందితో పాటు, పరిశీలనకు వచ్చే వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు,కౌంటింగ్ ఏజెంట్ల కోసం కల్పిస్తున్న కనీస వసతులు,సౌకర్యాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన అధికారిక ఎలక్షన్ పాసులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం పరిధిలోకి అనుమతించాలని,ఎవరికీ మినహాయింపులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
కౌంటింగ్ హాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని,విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా,ఏర్పాట్లలో లోపాలు తలెత్తితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన ప్రక్రియలో కొన్ని లోపాలను గమనించిన కలెక్టర్,ఒక దశలో సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే ఆ లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి గందరగోళం లేకుండా సాగడం కోసం సిబ్బందికి ఇప్పటికే ముందస్తుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం పోలింగ్ బాక్సులను అత్యంత భద్రంగా ఉంచే స్ట్రాంగ్ రూమ్ వద్ద,అలాగే కౌంటింగ్ జరిగే హాల్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అధికారులకు సూచించారు.కౌంటింగ్ కేంద్రం వెలుపల,పట్టణ పరిధిలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,ఆర్డీఓ,స్థానిక నియోజకవర్గ ఎన్నికల అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




