Nuzvid: నూజివీడు మున్సిపాలిటీకి రూ.155 కోట్లతో కొత్త అభివృద్ధి ప్రతిపాదనలు!

Nuzvid: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Oct 2026 9:24 AM IST
Nuzvid
X

Nuzvid: నూజివీడు మున్సిపాలిటీకి రూ.155 కోట్లతో కొత్త అభివృద్ధి ప్రతిపాదనలు!

Nuzvid: నూజివీడు పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఇందులో భాగంగానే రూ.88.46 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.శనివారం నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన,వేయబోతున్న కూటమి అభ్యర్థులు మంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి,ఎన్నికల ప్రచార దిశా నిర్దేశం చేశారు.మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా తాగునీరు,డబుల్ లైన్ రోడ్లు,డ్రైనేజీలు,పార్కులు,సెంట్రల్ లైటింగ్, కళ్యాణ మండపాలు,స్మశానవాటికల అభివృద్ధి వంటి ఎన్నో పనులను పూర్తి చేశామన్నారు.పట్టణాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరో రూ.155 కోట్లతో నూజివీడు మున్సిపాలిటీ రూపురేఖలు మార్చే కొత్త ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు.

రాజ్యాంగబద్ధంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా సీట్లు కేటాయించామని,టికెట్ ఆశించి దక్కని నాయకులు బాధపడొద్దని,రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని హామీ ఇచ్చారు.2029 ఎన్నికల విజయానికి ఈ స్థానిక ఎన్నికలే పునాది అని,అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ స్థాయికి దిగజార్చి,అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి విమర్శించారు.నేడు సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ప్రధాని నరేంద్ర మోదీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతోందన్నారు.గతంలో అభివృద్ధిని పట్టించుకోని నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు గట్టిగా నిలదీయాలని కోరారు.

మున్సిపాలిటీలోని 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయభేరి మోగించేలా నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్-చైర్మన్,నియోజకవర్గ పరిశీలకులు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కూటమి అభ్యర్థులు,పట్టణ ప్రముఖులు,భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్