Nuzvid: నూజివీడు మున్సిపల్ సమరంలో వైఎస్సార్సీపీ భారీ ముగింపు ర్యాలీ
Nuzvid: నూజివీడు మున్సిపల్ ఎన్నికల ముగింపు రోజున చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ కుమార్, 36 వార్డుల కౌన్సిలర్ల తరఫున మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ భారీ ర్యాలీ నిర్వహించారు.
Nuzvid: నూజివీడు మున్సిపల్ సమరంలో వైఎస్సార్సీపీ భారీ ముగింపు ర్యాలీ
నూజివీడు: నూజివీడు మున్సిపల్ సమరంలో ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంది.నేడు సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో, పురపాలక సంఘం పరిధిలో రాజకీయ సెగలు తారస్థాయికి చేరాయి. నూజివీడు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి.
మాజీ శాసనసభ్యులు మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో పట్టణంలో నిర్వహించిన భారీ ముగింపు ప్రదర్శన ఓటర్ల దృష్టిని అమితంగా ఆకర్షించింది.నూజివీడు పట్టణ వీధులు వైఎస్సార్సీపీ జెండాలతో, కార్యకర్తల నినాదాలతో హోరెత్తాయి.మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ బలప్రదర్శనను చాటాయి.
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆద్వర్యంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ కుమార్,మరియు పట్టణంలోని 36 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించారు.స్థానిక ద్వారకా ఎస్టేట్ నుండి అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ జనసందోహ ర్యాలీ,పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది.
ద్వారకా ఎస్టేట్ నుంచి చిన్న గాంధీ బొమ్మ సెంటర్,అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి కోవెల మీదుగా పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వరకు కనులపండువగా సాగింది. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, యువత మరియు పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా కదిలారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ"గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే కాకుండా నూజివీడులో కూడా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు సమానంగా అందాయి. ప్రతి పేద కుటుంబానికి ఎంతో మేలు చేకూరింది.కానీ,ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు,పైగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఎన్నికల వేళ మిమ్మల్ని ఎవరు భయపెట్టినా,బెదిరించినా లొంగిపోవద్దు.ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా మీ భవిష్యత్తు కోసం నిలబడండి. నూజివీడు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే మన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ కుమార్ తో పాటు 36 వార్డుల వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.
ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నాను. పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఓటర్ల ముందుకు వెళ్తోంది. ప్రచార గడువు ముగిసిన తరుణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శించిన ఈ ఐక్యత, జనసమీకరణ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
అటు చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవ కుమార్,ఇటు 36 వార్డుల అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ భారీ ర్యాలీతో నూజివీడు మున్సిపల్ ఎన్నికల వేడి క్లైమాక్స్ కు చేరింది.




