Kukunoor: ప్రజల ఆశీర్వాదం కూటమికే.. స్థానిక సమరానికి సిద్ధం కావాలి

Kukunoor: కుక్కునూరు మండలంలో టీడీపీ, జనసేన కూటమి ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 11 Oct 2026 8:59 PM IST
Kukunoor
X

Kukunoor: ప్రజల ఆశీర్వాదం కూటమికే.. స్థానిక సమరానికి సిద్ధం కావాలి

కుక్కునూరు: కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కుక్కునూరు మండలంలో ప్రజల ఆశీర్వాదం కూటమి నాయకులకు ఉందని టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు) పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆదివారం గొమ్ముగూడెం, మారేడుబాక, కుక్కునూరు, కివ్వాక, దాచారం పంచాయతీలకు చెందిన కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుక్కునూరు మండలం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉందని, ప్రతి ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకుల సహకారంతో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తాం: ములిశెట్టి యుగంధర్

జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.

సూపర్ సిక్స్ పథకాలే కీలకం: కోటగిరి సత్యనారాయణ

టీడీపీ సీనియర్ నాయకుడు, మండల సొసైటీ మాజీ అధ్యక్షుడు కోటగిరి సత్యనారాయణ మాట్లాడుతూ.. 1984లో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వెంట కుక్కునూరు మండల ప్రజలు నడిచారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలకంగా పనిచేశారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తీసుకువస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తాం

జనసేన పార్టీ కుక్కునూరు మండల ఉపాధ్యక్షులు మంత్రి గోపాలకృష్ణ, మోదంపురపు వెంకన్నబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. కివ్వాక పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ మాచర్ల గంగరాజు, మాజీ వైస్ ఎంపీపీ బోల్లు కృష్ణార్జునరావు, సొసైటీ అధ్యక్షుడు రావు శ్రీనివాసరావు, సొసైటీ మాజీ డైరెక్టర్ పులి శ్రీను, జనసేన మండల నాయకులు చల్లా కోటి, సమయమంతుల లక్ష్మణస్వామి, గరటం వెంకటరమణ, సీనియర్ నాయకులు సరిహద్దు సత్యనారాయణ, శకపల్లి చందర్రావు, నరేంద్ర రాజు, జెట్టి సూర్యం, పాదం రాము, అంగిరేకుల బాలాజీ, బడుగు మల్లేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR