Kukunoor: వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండేటి వాగు కాజ్వే 10 గ్రామాలకు రాకపోకలు బంద్‌!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండేటి వాగు కాజ్వే. 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. 20 కి.మీ. చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 9 Nov 2026 2:16 PM IST
Kukunoor
X

Kukunoor: వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండేటి వాగు కాజ్వే 10 గ్రామాలకు రాకపోకలు బంద్‌!

Kukunoor: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మురుసు తుఫాను ప్రభావంతో కుక్కునూరు మండలంలో గుండేటి వాగు ఉధృతంగా ప్రవహించింది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంతో భారీగా వరద నీరు గుండేటి వాగులోకి చేరింది. ఈ వరద ఉధృతికి కుక్కునూరు–బెస్తగూడెం మధ్య ఉన్న గుండేటి వాగు కాజ్వే పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో ఆయా ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కుక్కునూరు మండల కేంద్రం నుంచి దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలోని పది గ్రామాలకు ఈ కాజ్వే ప్రధాన రాకపోకల మార్గంగా ఉంది. ఈ మార్గం అందుబాటులో ఉంటే కేవలం 10 కిలోమీటర్ల ప్రయాణంతోనే ఆయా గ్రామాలకు చేరుకోవచ్చు. అయితే కాజ్వే కొట్టుకుపోవడంతో కుక్కునూరు నుంచి నల్లకుంట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సుమారు 20 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు నిత్యం వైద్యం, విద్య, నిత్యావసరాలు, ఇతర అత్యవసర పనుల కోసం కుక్కునూరు మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. కాజ్వే దెబ్బతినడంతో ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

గుండేటి వాగు కాజ్వే కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయినా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కాజ్వేకు మరమ్మతులు చేపట్టి పది గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం పునరుద్ధరించాలని అధికారులను వేడుకుంటున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR