Kukunoor: కుక్కునూరులో రోడ్లపైనే కొబ్బరి పొట్టు లారీల ఇష్టారాజ్యం!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో ఆర్ అండ్ బి రోడ్లపై కొబ్బరి పొట్టు లారీల అక్రమ నిలుపుదల. రవాణా, లోడింగ్‌ వ్యాపారంతో ప్రయాణికుల ఇబ్బందులు. అధికారుల నిర్లక్ష్యం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 9 Nov 2026 2:35 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో రోడ్లపైనే కొబ్బరి పొట్టు లారీల ఇష్టారాజ్యం!

Kukunoor: కుక్కునూరు మండలంలో కొబ్బరి పొట్టు రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ అండ్ బి ప్రధాన రహదారులపైనే భారీ లారీలను నిలిపి కొబ్బరి పొట్టును ట్రాక్టర్లలోకి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుక్కునూరు మండలంలోని బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు తదితర గ్రామాల్లో పదివేలకు పైగా జామాయిల్‌, జామ క్లోన్ నర్సరీలు ఏర్పాటు చేసి కొందరు వ్యక్తులు భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. మొక్కల అంటుకట్టే ప్రక్రియలో వినియోగించే కొబ్బరి పొట్టును భారీ లారీల ద్వారా ఆయా గ్రామాలకు తరలిస్తున్నారు.

అయితే ఈ లారీలను నర్సరీలకు సంబంధించిన ప్రదేశాల్లో కాకుండా ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఆర్ అండ్ బి ప్రధాన రహదారులపైనే నిలిపి ట్రాక్టర్లలోకి కొబ్బరి పొట్టును లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పంచాయతీ రహదారులను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు స్పందించరా?

కుక్కునూరు మండలంలో రహదారులపైనే కొనసాగుతున్న కొబ్బరి పొట్టు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వ్యవహారంపై జిల్లా, మండల స్థాయి అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, రహదారులపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యాపార కార్యకలాపాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు పలువురు డిమాండ్ చేస్తున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR