Kukkunoor: కివ్వాకలో వైభవంగా మహాలక్ష్మీదేవి కుంకుమ పూజలు
Kukkunoor: కుక్కునూరు మండలం కివ్వాకలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.
Kukkunoor: కివ్వాకలో వైభవంగా మహాలక్ష్మీదేవి కుంకుమ పూజలు
కుక్కునూరు: మండలం కివ్వాక గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్థానిక ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ముఖ్యంగా మహిళలు, భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. కివ్వాకతో పాటు పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు పులిహోర పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు వాడపల్లి సాయి, గురుస్వామి బట్టు వీరబాబు, భవానీ భక్తులు రాయికృష్ణార్జునరావు, ఇనుముల గోపరాజు, పగిళ్ల రాంబాబు, ఎం. వెంకన్నబాబు, రమేష్ గుప్తా, డాక్టర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.




