Vinjamoor: కలిగిరి స్కూల్‌లో విద్యార్థిపై దాడి ఆరోపణలు!
Vinjamoor: కలిగిరి న్యూ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్‌లో విద్యార్థినిపై దాడి ఆరోపణలు: ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే కేసు, పంచాయితీలో రూ.43 వేల వసూలుపై విచారణకు డిమాండ్.
Vinjamoor: కలిగిరి స్కూల్‌లో విద్యార్థిపై దాడి ఆరోపణలు!
Vinjamoor: కలిగిరి మండలంలోని న్యూ ఇన్ఫాంట్ జీసస్ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఏఎస్‌పేట మండలానికి చెందిన ఓ విద్యార్థిని పాఠశాల హెడ్మాస్టర్ కొట్టినట్లు ఆరోపిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు.
తమ కుమార్తె పై దాడి ఎందుకు చేశారంటూ ప్రశ్నించిన సమయంలో పాఠశాల కరస్పాండెంట్ తమతో దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా, తమను ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
రూ.లక్ష డిమాండ్ చేశారంటూ ఆరోపణ
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అనంతరం కొందరు నాయకుల సమక్షంలో తమను పంచాయితీకి పిలిపించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అక్కడ రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారని, ఆ మొత్తం ఇవ్వకపోతే ఎంబీబీఎస్ చదువుతున్న తమ కుమారుడిపై కేసు నమోదు చేయించి అతని భవిష్యత్‌ను నాశనం చేస్తామని బెదిరించినట్లు వారు ఆరోపించారు.
ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు రూ.43 వేలతో రాజీకి అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలు,రాజీ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యం లేదా కరస్పాండెంట్ నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలేనా?
ఇదే పాఠశాలలో గతంలోనూ విద్యార్థులపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల యాజమాన్యానికి నిబంధనల అమలుపై భయం లేకుండా పోయిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులపై దాడి ఆరోపణలు, తల్లిదండ్రులపై ఫిర్యాదు, పంచాయితీ,డబ్బుల డిమాండ్ ఆరోపణలు,గతంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా.ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.




