Eluru: చేబ్రోలులో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్
Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలులో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు.
Eluru: చేబ్రోలులో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్
ఏలూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు మంజూరయ్యాయని,వీటిలో 10 క్లినిక్ ల నిర్మాణాలు పూర్తి అయ్యాయయని,మిగిలినవి త్వరలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
జిల్లాలో మంగళవారం చేబ్రోలు,తోకలపల్లి,నూజివీడు నియోజకవర్గంలోని చిన ఆగిరిపల్లిలో విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రారంబిస్తున్నామన్నారు.ఈ విలేజ్ క్లినిక్ లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయన్నారు.చేబ్రోలు గ్రామాన్ని అభివృద్ధిలో జిల్లాకే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని చేబ్రోలు గ్రామంలో రోడ్లు,త్రాగునీరు,విద్యా,వైద్యం వంటి అన్ని రంగాలలో అభివృద్ధిచేసి,అభివృద్ధికి ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.గ్రామంలో రోడ్లుఅభివృద్ధి చేయడం జరిగిందని, ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీటిని అందిస్తున్నామన్నారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో మాతృ,శిశు మరణాలు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.'మాతృ' కార్యక్రమం ద్వారా హై రిస్క్ గర్భిణులను గుర్తించి,వారికి ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేలా ప్రతీ గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. గ్రామాభివృద్ధికి ఇంకా చేయవలసిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని కలెక్టర్ అన్నారు.ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయన్నారు.
నియోజకవర్గంనకు 76 విలేజ్ హెల్త్ క్లినిక్ లు మంజూరయ్యాయని,వీటిలో 45 పూర్తి అయ్యాయన్నారు.నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.170 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం,52 కోట్ల రూపాయలతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా మంచినీరు సరఫరా,52 కోట్ల రూపాయలతో జలధార పనులు చేశామన్నారు.
నియోజకవర్గంలో 8 పిహెచ్సి లు ఉన్నాయని,నిడమర్రులో కొత్తగా పిహెచ్సి ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరుకు హామీ ఇచ్చారని,పిహెచ్సి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు.రైతులకు సబ్సిడీ డ్రోన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని కృతఙ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్.రమేష్,తహసీల్దార్ ఎం.సన్యాసిరావు,ఎంపిడిఓ జి.రాజ్ మనోజ్,వైద్య శాఖాధికారులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




