Velerupadu: కట్కూరు ఎంపీటీసీ నామినేషన్లపై వివాదం.. కూటమి ఆందోళన!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు ఎంపీటీసీ నామినేషన్లపై వివాదం చెలరేగింది. పీసా కమిటీ పదవుల్లో కొనసాగుతూనే అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కూటమి నేతలు ఆందోళన చేపట్టారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 19 Nov 2026 3:49 PM IST
Velerupadu
X

Velerupadu: కట్కూరు ఎంపీటీసీ నామినేషన్లపై వివాదం.. కూటమి ఆందోళన!

వేలేరుపాడు: మండలం కట్కూరు ఎంపీటీసీ స్థానానికి కూటమి, వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకే గ్రామ పంచాయతీకి చెందిన వారు కావడం, అదే సమయంలో పీసా కమిటీలో కీలక పదవుల్లో కొనసాగుతుండటం వివాదానికి దారితీసింది. కోయిదా పంచాయతీకి చెందిన బుజారి చిట్టిబాబు రెడ్డి కూటమి బలపరిచిన అభ్యర్థిగా, సోడే సురేష్ వైసీపీ అభ్యర్థిగా ఎంపీటీసీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే బుజారి చిట్టిబాబు రెడ్డి పీసా కమిటీ ఉపాధ్యక్షుడిగా, సోడే సురేష్ కార్యదర్శిగా కొనసాగుతున్నారని, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందు తమ పీసా కమిటీ పదవులకు రాజీనామా చేయలేదని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. పీసా కమిటీ పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు రాజీనామా చేయాలనే నిబంధన తమకు తెలియదని కూటమి నాయకులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సంబంధిత నిబంధనలను పరిశీలించకుండానే అధికారులు ఇద్దరి నామినేషన్లను ఆమోదించారని కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థులు రాజీనామా పత్రాలు సమర్పించకపోయినా, సమర్పించినట్లుగా పత్రాలు సృష్టించారనే ఆరోపణలు సైతం చేస్తున్నారు.

మరోవైపు పీసా కమిటీ పదవులకు అభ్యర్థులు రాజీనామా చేసిన పత్రాలను ఐటీడీఏ పీఓకు పంపించామని వేలేరుపాడు ఇంచార్జీ ఎంపీడీఓ చెబుతున్నారు. అయితే వేలేరుపాడు టీడీపీ మండల కన్వీనర్ అమరవరపు అశోక్ ఫోన్ ద్వారా ఐటీడీఏ పీఓను వివరణ కోరగా, కట్కూరు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల రాజీనామా పత్రాలు తమకు అందలేదని పీఓ తెలిపినట్లు కూటమి నాయకులు పేర్కొంటున్నారు.

అధికారుల వివరణకు, ఐటీడీఏ పీఓ తెలిపిన సమాచారానికి మధ్య వ్యత్యాసం ఉండటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో నామినేషన్ల ఆమోదం, రాజీనామా పత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కూటమి నాయకులు ఆందోళనకు దిగారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ పీసా కమిటీ రాజీనామాల వివాదం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై ఎలాంటి స్పష్టత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR