Kukunoor: కుక్కునూరు మండలంలో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం!

Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో సర్పంచ్ ఎన్నికల వేళ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. షాపుల్లో నో స్టాక్ అంటూ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 23 Nov 2026 2:20 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు మండలంలో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం!

కుక్కునూరు: సర్పంచ్ ఎన్నికల వేళ కుక్కునూరు మండలంలోని గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోందని, అయినప్పటికీ సంబంధిత అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షణ చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మరోవైపు కుక్కునూరు, ఉప్పేరు గ్రామాల్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బాటిళ్లపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో స్టాక్ లేదని చెబుతున్న కొన్ని బ్రాండ్లు గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మాత్రం అందుబాటులో ఉంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలపై ఎక్సైజ్ శాఖ నిఘా ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రూ.99 చీప్ లిక్కర్.. ఇప్పుడు రూ.130–150?

సామాన్య ప్రజలకు తక్కువ ధరలో మద్యం అందించాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం రూ.99కే చీప్ లిక్కర్ అందించిన విషయాన్ని వినియోగదారులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో రూ.100 చెల్లిస్తే రూ.99 విలువైన మద్యం బాటిల్‌తో పాటు మిగిలిన రూపాయికి అగ్గిపెట్టె లేదా చాక్లెట్ ఇచ్చేవారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అదే రకం చీప్ లిక్కర్ కొనుగోలు చేయాలంటే రూ.130 నుంచి రూ.150 వరకు చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ధరల్లో వచ్చిన మార్పుపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

రూ.20 అదనంగా ఇస్తేనే మద్యం బాటిల్?

కుక్కునూరు, ఉప్పేరు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రతి బాటిల్‌పై ముద్రించిన ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అదనంగా ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే, తాము అడిగిన బ్రాండ్లు స్టాక్‌లో లేవని, కొత్త స్టాక్ రావడానికి వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని కౌంటర్ సిబ్బంది చెబుతున్నారని పేర్కొంటున్నారు. అయితే అదనంగా రూ.20 చెల్లించేందుకు సిద్ధపడితే, స్టాక్ లేదని చెప్పిన అదే బ్రాండ్ బాటిళ్లను వెంటనే అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

షాపుల్లో నో స్టాక్.. బెల్ట్ షాపుల్లో ఫుల్ స్టాక్!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో స్టాక్ లేదని చెబుతున్న కొన్ని బ్రాండ్ల బాటిళ్లు గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మాత్రం నిత్యం కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాటిల్‌పై ఉన్న ధర కంటే ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే, ప్రభుత్వ మద్యం దుకాణాల వద్దే తాము ఒక్కో బాటిల్‌కు రూ.20 అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నామని కొందరు బెల్ట్ షాపుల నిర్వాహకులు చెబుతున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. తాము చెప్పిన ధరకు తీసుకుంటే తీసుకోవాలని, లేదంటే వెళ్లిపోవాలని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు.

ఒక్కో వీధికి రెండు మూడు బెల్ట్ షాపులు?

మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఒక్కో వీధికి మూడు, నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. వినియోగదారులు కోరిన బ్రాండ్ సైతం సులభంగా లభిస్తుండటంతో బెల్ట్ షాపుల వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చని విమర్శిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 11, 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మద్యం విక్రయాలు, సరఫరాపై ప్రత్యేక నిఘా అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీ జరుగుతోందా? అనే అంశంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో మద్యం నిల్వలు, విక్రయ కేంద్రాలు, రవాణాపై తనిఖీలు చేపట్టాల్సి ఉండగా, గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం పంపిణీ లేదా విక్రయాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నాటుసారా స్థావరాలపై దాడులు.. బెల్ట్ షాపులపై తనిఖీలేవీ?

సరిహద్దు గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, బెల్ట్ షాపులపై అదే స్థాయిలో తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులకు వచ్చిన రోజుల్లో ఆయా గ్రామాల పరిధిలోని బెల్ట్ షాపులు మూతపడుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అధికారులు దాడులు నిర్వహించే రోజే బెల్ట్ షాపులు మూసివేయడం యాదృచ్ఛికమా? లేక ముందస్తు సమాచారం అందడంతోనే నిర్వాహకులు అప్రమత్తమవుతున్నారా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. నాటు సారా పై దాడులు నిర్వహించినట్టే బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాలకు కూడా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఎక్సైజ్ శాఖ స్పందించాలి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ అమలు, అదనపు వసూళ్ల ఆరోపణలు, స్టాక్ కొరత పేరుతో జరుగుతున్న విక్రయాలు, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా, ఎన్నికల వేళ అక్రమ మద్యం విక్రయాలు ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ సమగ్ర విచారణ చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ధరల పట్టికలు, విక్రయ బిల్లులు, స్టాక్ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు గ్రామాల్లోని బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR