Nuzividu: ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: మంత్రి పార్థసారధి!

Nuzividu: ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో పోలింగ్ కేంద్రాలను మంత్రి కొలుసు పార్థసారధి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 6:59 PM IST
Nuzividu
X

Nuzividu: ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: మంత్రి పార్థసారధి!

నూజివీడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అందరూ ఉత్సాహంగా పాల్గొని,తమ ఓటు హక్కును బాధ్యతగా,స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నూజివీడు నియోజకవర్గం లోని చాట్రాయి మండలం నరసింహాపురం, బూరుగుగూడెం, చాట్రాయి గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను మంత్రి సందర్శించారు.

అక్కడ ఓటింగ్ సరళిని,ఓటర్లకు కల్పించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఓటు హక్కు ద్వారానే ప్రజలు మంచి పరిపాలనను నిర్దేశించుకోగలరని, ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,వారు నిర్భయంగా ఓటు వేసేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ,పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్