Eluru: తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో పెద్దపులి సంచారం
Eluru: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీపీఎస్ ట్రాకర్ సహాయంతో పులి కదలికలను ట్రాక్ చేస్తున్న అటవీశాఖ అధికారులు.
Eluru: తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో పెద్దపులి సంచారం
ఏలూరు: ఏలూరు జిల్లాల పరిధిలోని తాళ్లపూడి,గోపాలపురం,పోలవరం మండలాల్లో పెద్దపులి సంచరించరిస్తోందనే సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.గతంలో దానికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా పులి ఎటువైపునకు వెళ్తుందో తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
సీతానగరం నుంచి గోదావరి నదిని దాటుకుంటూ ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల మీదుగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరం మీదుగా వెళ్లి అక్కడి నుంచి తిరిగి తాళ్లపూడి మండలం బయ్యవరం,తుపాకులగూడెం,రాగోలపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు.
జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా ప్రతి మూడు,అయిదు గంటలకోసారి పెద్దపులి కదలికల ఆధారంగా ఎక్కడుందో తెలుస్తోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తాళ్లపూడి మండలంలోని బయ్యవరం,రాగోలపల్లి తుపాకులగూడెం నుంచి ఒక రైతుకు చెందిన ఆయిల్‌పామ్ తోట నుంచి పాత్రునిచెరువు ఆయకట్టు పరిధి మీదుగా ఎలుగుకొండ ఎక్కినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు. తెల్లవారు జామునే పంటపొలాలకు రైతులు,కూలీలు వెళ్లవొద్దని అటవీశాఖ,'రెవెన్యూ, పంచాయతీ,పోలీసుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు.
ఈ పరిసరాల ప్రాంతాల పరిధిలో కొండ ప్రాంతాలు ఉండటంతో పులి సంచరించే అవకాశం ఉందని,చీకటి పడిన తర్వాత ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.పెద్దపులి కదలికను తెలుసుకునేందుకు 15 కెమెరాలను అమర్చామని,ఒక బోను సిద్ధం చేశామని డిప్యూటీ రేంజ్ అధికారి ఎ.సూరిబాబు తెలిపారు.




