Kukunoor: కుక్కునూరులో ఘనంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవం!
Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండల పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఎంపీపీగా ఆసి శ్రీలత, వైస్ ఎంపీపీగా తాళ్లూరి సురేష్ బాధ్యతలు స్వీకరించారు.
Kukunoor: కుక్కునూరులో ఘనంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవం!
కుక్కునూరు: మండల పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మండలంలోని పది ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ.. జెడ్పీటీసీ స్థానాన్ని సైతం దక్కించుకుంది. కుక్కునూరు-2 ఎంపీటీసీ సభ్యురాలు ఆసి శ్రీలత ఎంపీపీగా, శ్రీధర వేలేరు ఎంపీటీసీ సభ్యుడు తాళ్లూరి సురేష్ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గురువారం కుక్కునూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులందరితో రిటర్నింగ్ అధికారి రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఆసి శ్రీలత, వైస్ ఎంపీపీ తాళ్లూరి సురేష్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ బొంతు కోమలాదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టిన మండల ప్రజలకు, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజలకు అండగా ఉంటూ.. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం జెడ్పీటీసీ బొంతు కోమలాదేవి మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ తనను గెలిపించిన ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు యుగంధర్, మాజీ ఎంపీపీ మాచర్ల గంగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




