Pedapadu: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి

Pedapadu: ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పెదపాడు, కొత్తూరు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 4:40 PM IST
Pedapadu
X

Pedapadu: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా: ఓటు వేసేందుకు వచ్చే ఓటర్ల వద్ద ఉన్న ఫోటో గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారులు తప్పనిసరిగా,క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలోని 54,55,56 నెంబర్ పోలింగ్ కేంద్రాలతో పాటు, పెదపాడులోని 43 నుంచి 50 వరకు గల పోలింగ్ కేంద్రాలలో గురువారం జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను, సరళిని ఆమె స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియపై సిబ్బందికి ఇప్పటికే రెండుసార్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని గుర్తుచేశారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను,భారత ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలన్నారు.ఓటర్లు తెచ్చే ఫోటో గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించాలని సూచించారు.

పోలింగ్ సిబ్బందికి ఏదైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే ప్రిసైడింగ్ అధికారి లేదా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఎవరైనా న్యూసెన్స్ సృష్టించి,పోలింగ్ ప్రక్రియకు అడ్డుపడితే వెంటనే స్థానిక పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలన్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల క్యూ లైన్లను, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు,200 మీటర్ల పరిధిలో ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఓటు వేసే విధానంలో గోప్యత (సీక్రెసీ) పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించారు. పోలింగ్ ఏర్పాట్లపై,అక్కడ ఎదురవుతున్న సమస్యలపై స్థానిక ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.

సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో,క్యూలైన్లలో ఓటు వేసేందుకు వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే బ్యాలెట్ పత్రాలతో కూడిన బ్యాలెట్ బాక్సులను అత్యంత జాగ్రత్తగా నిర్దేశించిన స్ట్రాంగ్ రూంలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీ కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణజ్యోతి,ఇంచార్జ్ ఎంపిడిఓ ఇందిరాగాంధీ, పంచాయతీ కార్యదర్శి పవన్ మరియు ఇతర రెవెన్యూ,పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్