Polavaram: పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కలెక్టర్ వార్నింగ్!

Polavaram: పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవకతవకలపై కలెక్టర్ వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Oct 2026 7:15 AM IST
Polavaram
X

Polavaram: పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కలెక్టర్ వార్నింగ్!

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే సంబంధిత కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు.జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామ పంచాయతీ చల్లావారిగూడెంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ కాలనీ లో బుధవారం కలెక్టర్ పర్యటించి,కాలనీలో ఇళ్ళు,మౌలిక సదుపాయాలు నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వేలేరుపాడు మండలానికి చెందిన కాపు లాలయ్య,లలితా దంపతులు జిల్లా కలెక్టర్ ను కలిసి తమకి 2025లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొత్తం 6.86 లక్షలు మంజూరు చేశారని,కానీ సదరు మొత్తం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేరే అకౌంట్ కి జమ అయిందన్నారు.ఈ విషయం పై 2025 జనవరి నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని కానీ,తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు.

ఈ విషయంపై ఆర్ అండ్ ఆర్ అధికారి మరియు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని కలెక్టర్ వివరణ అడిగారు.ఈ విషయంపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్ మాట్లాడుతూ సొమ్ము జమచేసి సమయంలో లబ్ధిదారుని అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేయడంతో శ్రీకాకుళం లోని వేరే వారి అకౌంట్ లో జమ అయిందని,శ్రీకాకుళంలో పోలీసు కేసు నమోదుచేశామని,త్వరలో సదరు నిర్వాసితుని అకౌంట్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి మొత్తం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కు తెలియజేసారు.

ఈ విషయంపై కలెక్టర్ జిల్లా కలెక్టర్ సంబంధిత రెండు ఎకౌంట్ నెంబర్ పరిశించగా తప్పు జరిగేందుకు అవకాశం లేని విధంగా నంబర్లు వేరువేరుగా ఉండటంతో,20 నెలల సమయం నుండి సమస్య పరిష్కారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, అకౌంట్ నెంబర్ నమోదులో ఉద్దేశ్యపూర్వకంగా చేసి ఉండవచ్చని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ఐటిడిఏ పిఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెల రోజుల్లోగా సదరు నిర్వాసిత కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొత్తాన్ని అందించాలని,లేనిపక్షంలో ఆర్ అండ్ ఆర్ అధికారి మరియు ఐటిడిఏ పిఓ జీతం నుండి మరియు పొరపాటుచేసిన సంబంధిత సిబ్బంది జీతం నుండి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.దాంతోపాటు సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఐటిడిఏ పిఓ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల పూర్తిపై ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని,ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నిర్వాసితులందరినీ దశలవారీగా డిసెంబర్ లోగా కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామ పంచాయతీ చల్లావారిగూడెంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ కాలనీ 1453 గృహాల నిర్మాణానికి గాను,646 గృహాలు పూర్తి నిర్వాసితులు గృహాలకు తరలించడం జరిగిందని,మరో 400 ఇళ్ల నిర్మాణాలు పూర్తిఅయ్యాయని,వారిని కూడా వారం రోజులలో కొత్త గృహాలకు తరలిస్తామన్నారు.చింతూరుకు చెందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అక్కడ భూమి లభ్యత లేని కారణంగా ఏలూరు జిలాల్లో ఇళ్ల నిర్మాణాలు,పరిహారాలు నిమిత్తం భూమిని సేకరించి అందించడం జరిగిందన్నారు.

కాలనీకి తరలిన ప్రజలలో యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని,అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.కాలనీలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ కు తెలియజేస్తూ తమ కాలనీలో వీధి దీపాలు లేవని ఏర్పాటుచేయాలని కోరగా వారంలోగా విద్యుత్ ఏర్పాటుచేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కాలనీకి 11/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుచేసి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అక్టోబర్ 3వ తేదీ నుండి పనులు ప్రారంభించి 20 రోజులలలోగా పూర్తిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.వేలేరుపాడు నుండి చల్లావారిగూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీకి వచ్చిన తమకు ఇదే ప్రాంతంలో ఓటుహక్కు కల్పించాలని ప్రజలు కోరారు.

కొందరు నిర్వాసితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి,భూమికి భూమి పరిహారం అందలేదని,కాలనీలో త్రాగునీరు,డ్రైనేజి,రోడ్లు వంటి ప్రాధమిక సౌకర్యాలు కల్పించాలని,స్మశానవాటికలు ఏర్పాటుచేయాలని కలెక్టర్ కోరారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్,ఆర్డీఓ రమణ,గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ,ఈఈ కె.వి.వి.ఎస్.ఎస్.ప్రసాద్,తహసీల్దార్ స్లీవజోజి,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్