Chintoor: వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలి
Chintoor: చింతూరులో వరద నష్టాలపై కలెక్టర్ కే. దినేష్ కుమార్ సమీక్ష. పొలాల్లో నీటిని తొలగించాలని, బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశం.
Chintoor: వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలి
చింతూరు: వరదలు,భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో చింతూరు డివిజన్‌కు చెందిన ప్రత్యేక అధికారులు,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినందున వ్యవసాయ పొలాల్లో నిలిచిన నీటిని శనివారం సాయంత్రంలోగా పూర్తిగా తొలగించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ, ఉద్యానవన,నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు.
పొలాల్లో ఎక్కువ కాలం నీరు నిలిచిపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.వరద నీటితో ముంపునకు గురైన కొన్ని నివాస ప్రాంతాల్లో కూడా నీటిని సాయంత్రంలోగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ,ఉద్యానవన పంటలకు జరిగిన నష్టం,ఇళ్లు దెబ్బతిన్న వివరాలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు, పశువుల నష్టం, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించిన సమగ్ర వివరాలను అన్ని శాఖల అధికారులు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటివరకు కొన్ని శాఖలు నష్టం వివరాలను సమర్పించకపోవడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ,నష్టం అంచనా వివరాల సేకరణలో ఎటువంటి జాప్యం ఉండరాదని స్పష్టం చేశారు.వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల,రహదారులు, విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితమైన వివరాలను అందించాలన్నారు.రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు తదితరాలకు జరిగిన నష్టాన్ని గుర్తించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు
వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచి, అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికి ఒక కిలో బంగాళాదుంపలు,ఒక కిలో ఉల్లిపాయలు,ఒక కిలో పప్పు,ఒక లీటర్ పామ్ ఆయిల్ అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.సహాయ సామగ్రిని జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ సమన్వయంతో కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని,చింతూరు డివిజన్‌లోని వరద ప్రభావిత కుటుంబాలన్నింటికీ సరుకులు చేరేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.ఇప్పటికే అవసరమైన సామగ్రితో పాటు అదనంగా కావాల్సిన సరుకుల కోసం ఇండెంట్ సిద్ధం చేసి తక్షణమే పంపాలని సూచించారు.అలాగే వరద ప్రభావిత కుటుంబాల పూర్తి గణనను నిర్వహించి,ఎవరెవరికి సహాయ సామగ్రి అవసరమో కుటుంబాల వారీగా జాబితా సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు వరద అనంతర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే గుర్తించి, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, రహదారులు, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్, ఓ ఎస్ డి జావళి,
పశుసంవర్ధక డిప్యూటీ డైరెక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్, ఎస్ డి సి బాలకృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దేవదానం, డ్వామా పిడి బి. రాంప్రసాద్, పి హెచ్ ఓ నరేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్ రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమా,ఎ పి ఓ జనరల్ రామ తులసి,డిఇ లు సుబ్బారావు, శ్రీరామచంద్రమూర్తి, వివిధ శాఖల అధికారులు, చింతూరు డివిజన్‌కు చెందిన ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




