Agiripalli: ఆగిరిపల్లిలో అర్ధరాత్రి పెట్రోల్ దాడి.. బైకులు దగ్ధం

Agiripalli: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బయ్య ఇంటిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ దాడి చేసి రెండు బైకులు, ఫర్నిచర్ తగులబెట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Oct 2026 8:49 PM IST
Agiripalli
X

Agiripalli: ఆగిరిపల్లిలో అర్ధరాత్రి పెట్రోల్ దాడి.. బైకులు దగ్ధం

ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో అర్ధరాత్రి వేళ ఘోర దారుణం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్,మాజీ గ్రామ సర్పంచ్ వైయస్సార్ సిపి నాయకుడు సుబ్బయ్య ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారు.ఇంటి ఆవరణలోని షెడ్డులో ఉన్న రెండు బైకులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

ఈ దాడిలో బైకులతో పాటు అక్కడే ఉన్న ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతై, ధ్వంసమయ్యాయి.ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితుడు సుబ్బయ్య ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ,పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి చెందిన ఒక క్వారీ,అలాగే బయో ప్లాంట్‌పై సుబ్బయ్య హైకోర్టులో కేసులు వేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కక్షపూరితంగా ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని బాధితుడు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని,బాధితుడిని పరామర్శించారు. ధ్వంసమైన బైకులను,షెడ్డును ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.ఆగిరిపల్లిలో పోలీసులు కనీస చర్యలు తీసుకోకుండా, కూటమి నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి..ఎదురుగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని పోలీస్ వ్యవస్థ తీరును తప్పుపట్టారు.నూజివీడు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై, స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీ మరియు డీఐజీ లకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్