Eluru: తహసీల్దార్ రవీంద్రనాథ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు!

Eluru: గెజిట్ నోటిఫికేషన్ కోసం రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏలూరు అర్బన్ తహసీల్దార్ శెట్టి వెంకట రవీంద్రనాథ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 28 Nov 2026 1:44 PM IST
Eluru
X

Eluru: తహసీల్దార్ రవీంద్రనాథ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు!

Eluru: ఏలూరు అర్బన్ తహసీల్దార్ శెట్టి వెంకట రవీంద్రనాథ్ పది వేల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.ఏలూరు తంగెళ్లమూడి ప్రాంతంలోని ద్వారకా నగర్‌కు చెందిన జంగం గోపాలం,తన పిల్లల చదువుల సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరాల కోసం ఆధార్ కార్డులో ఉన్న తన పేరును 'జినగం గోపి'గా మార్చుకోవాలని భావించారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలతో ఆయన ఏలూరు అర్బన్ తహసీల్దార్ రవీంద్రనాథ్‌ను ఆశ్రయించారు. అయితే, దరఖాస్తును ప్రాసెస్ చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు తహసీల్దార్ పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.

దీనితో బాధితుడు జంగం గోపాలం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేశారు.ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రవీంద్రనాథ్ పది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.కాగా,శెట్టి వెంకట రవీంద్రనాథ్ రెండు వేల సంవత్సరంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి,అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం ఏలూరు అర్బన్ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారని డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid