SI EXAM: రేపే ఎస్సై ప్రిలిమ్స్ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే!
SI EXAM: తెలంగాణ పోలీస్ నియామక పరీక్షకు 1,60,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
SI EXAM: రేపే ఎస్సై ప్రిలిమ్స్ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన కీలక నిబంధనలు ఇవే!
SI EXAM: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న పోలీస్ నియామక పరీక్షకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TGSLPRB) అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
అభ్యర్థులు శనివారం అర్ధరాత్రి 12 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్ (www.tgprb.in) ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు డైరెక్టర్ సూచించారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే [email protected] కు ఈ-మెయిల్ పంపాలని లేదా 040-41895151 హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
అభ్యర్థులు పాటించాల్సిన ముఖ్య నిబంధనలు:
పరీక్ష సమయానికి గంట ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా ఏ4 (A4) సైజు పేపర్‌పైనే ప్రింట్ తీసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను హాల్‌టికెట్ మొదటి పేజీలో నిర్దేశించిన స్థలంలో గమ్‌తో అతికించాలి. ఫొటో అతికించని హాల్‌టికెట్‌తో వస్తే పరీక్షకు అనుమతించరు.
పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల డిజిటల్ ఫొటో, వేలిముద్రలు, సంతకాలు సేకరించడంతో పాటు ఆధార్ ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ బయోమెట్రిక్ వివరాల నమోదుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అభ్యర్థులు చేతులకు మెహందీ, తాత్కాలిక టాటూలు, ఇతర రంగులు లేదా రసాయన పదార్థాలు పెట్టుకోవద్దని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.




