Child Beheaded: దారుణం.. ఏడాదిన్నర తమ్ముడిని చంపిన అన్న

Child Beheaded: పాట్నాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న 22 ఏళ్ల యువకుడు తన ఏడాదిన్నర తమ్ముడిని ఆలయంలో తలను నరికి హత్య చేశాడు.

CR Reddy
Published on: 25 Oct 2026 8:44 AM IST
Patna Crime
X

Patna Crime

Child Beheaded: బిహార్ రాజధాని పాట్నా పరిధిలోని రాణితలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనసును కలచివేసే ఉదంతం వెలుగుచూసింది. మానవ సంబంధాలను మంటగలుపుతూ తోడబుట్టిన అన్నే తన తమ్ముడిని అత్యంత క్రూరంగా కడతేర్చాడు. జీతన్ చప్రా గ్రామానికి చెందిన 22 ఏళ్ల అజిత్ కుమార్ అనే యువకుడు తన ఏడాదిన్నర చిన్న తమ్ముడు మనీష్‌ను ఆలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఎంతో పాశవికంగా చిన్నారి గొంతు కోసి చంపేశాడు. ఈ అఘాయిత్యం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

గుండెలు పిండేసే ఘటన జరిగిన తీరు

నిందితుడు అజిత్ తన తల్లి ఒళ్లో ఆడుకుంటున్న పసికందును బయట తిప్పి తీసుకువస్తానని చెప్పి ఎత్తుకెళ్లాడు. ఇంటికి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయ ప్రాంగణానికి తీసుకువెళ్లి, అక్కడ కొబ్బరికాయలు కొట్టే బండరాయిపై పసివాడిని పడుకోబెట్టాడు. తనతో పాటు తెచ్చుకున్న పదునైన కత్తితో చిన్నారి తలను వేరు చేశాడు. ఆ తర్వాత తెగిన తలను, మొండాన్ని, హత్యకు వాడిన ఆయుధాన్ని ఒక గుడ్డలో చుట్టుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. ఏమీ తెలియనట్లు ఆ రక్తపు మూటను తల్లి చేతికి అందించడంతో ఆమె గుండెలు అవిసేలా రోదించింది.

మత్తు పదార్థాలకు బానిసైన నిందితుడు

ఈ ఘోరానికి పాల్పడిన అజిత్ కుమార్ పోక్లెయిన్ మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రాథమిక విచారణలో నిందితుడు విపరీతమైన మద్యం, గంజాయి, స్మోక్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలకు పూర్తిగా బానిసైనట్లు తేలింది. రక్తం కరుడుకట్టిన ఆ రూపం చూసి దిగ్భ్రాంతి చెందిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి పరుగులు తీశారు. పరారయ్యేందుకు యత్నించిన నిందితుడిని స్థానికులు తరిమిపట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆలయ ప్రాంగణాన్ని సీలు చేశారు. ఈ ఘటనపై పాలీగంజ్ ఎస్‌డీపీఓ పంకజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఇదొక నరబలి కేసుకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. నిందితుడు తీవ్రమైన మత్తులో ఉండి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ అరాచకానికి పాల్పడ్డాడని తెలిపారు. అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.