Madanapalle: కేంద్రీయ విద్యాలయ, హంద్రీ-నీవా భూములను కాపాడాలి

Madanapalle: వలసపల్లెలో కేంద్రీయ విద్యాలయ, హంద్రీ-నీవా ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని మదనపల్లె తహశీల్దార్‌కు బహుజన యువసేన నేత పునీత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 5 Oct 2026 9:17 PM IST
Madanapalle
X

Madanapalle: కేంద్రీయ విద్యాలయ, హంద్రీ-నీవా భూములను కాపాడాలి

Madanapalle: మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమితో పాటు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ భూములను అక్రమ ఆక్రమణలు, అనధికార నిర్మాణాల నుంచి కాపాడాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షులు జి. పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు మదనపల్లె తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నప్పటికీ రాత్రి వేళలు, సెలవు రోజులను ఆసరాగా చేసుకుని నిర్మాణాలు కొనసాగుతున్నట్లు సమాచారం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ స్థలంతో పాటు హంద్రీ-నీవా ప్రభుత్వ భూమిలో బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

సంబంధిత భూములకు పూర్తి స్థాయి సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్ స్థాయిలో పరిశీలనలు, ఆదేశాలు జరిగినప్పటికీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్లయితే అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరపాలని పునీత్ కుమార్ కోరారు.

“ప్రభుత్వ భూమి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. కేంద్రీయ విద్యాలయం, హంద్రీ-నీవా వంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూములను రక్షించడం అధికారుల బాధ్యత. వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, పూర్తి స్థాయి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వాస్తవ పరిస్థితిని అధికారులు స్పష్టం చేయాలి” అని పునీత్ కుమార్ డిమాండ్ చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle